మహిళలపై రోజురోజుకు అఘాయిత్యాలు పెరుగుతూనే ఉన్నాయి. పెళ్లికాని వారికి , పెళ్లైన వారికి ఎవరికీ భద్రత లేదు. కొందరు భర్తలు తమ సైకో మెంటాలిటీ అంతా వాళ్ల భార్యలపైనే చూపిస్తారు. గృహహింసల కారణంగా.. మహిళలు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. కొన్నిసార్లు చంపబడతున్నారు. అసలు కిచిడీలో ఉప్పు ఎక్కువైందని ఎవరైనా భార్యను చంపేస్తారా.. ఈ దుర్మార్గుడు ఇలానే చేశాడు. మహారాష్ట్రలో జరిగిన ఈ ఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
మహారాష్ట్ర థానేలోని భయాందర్ టౌన్‌షిప్‌లో నివాసముంటున్న నీలేష్ ఘాగ్(46) తన భార్య చేసిన కిచిడీలో ఉప్పు ఎక్కువైందని ఆగ్రహానికి గురయ్యాడు. అనంతరం పొడవాటి గుడ్డతో ఆమె గొంతు బిగించి హత్య చేశాడు. శుక్రవారం ఉదయం 9గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడైన భర్తపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
ఇదొక్కడే కాదు.. డైలీ ఏదో ఒకచోట ఇలాంటి చెత్త కారణాలతో నిండుప్రాణాలను బలిగొంటున్నారు తాగుబోతు మొగుళ్లు. అన్నం వండలేది, ఇష్టమైన కూరచేయలేదని ఇంటి ఆడవాళ్లను తెగనరికిన తాగుబోతుల ఉదంతాలు కోకల్లలు. ఏదో ఒక వంకతో దాడి చేయడమే సైకోల లక్షణమని పలు అధ్యయనాల్లో తేటతెల్లమైంది. మహారాష్ట్రలో ఇలాంటి ఘటనలు ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూనే ఉన్నాయి. మొన్నటికి మొన్న..ఉదయాన్నే టీతో పాటు టిఫిన్ పెట్టలేదనే కోపంతో ఓ ముసలాయన కోడలిని తుపాకీతో కాల్చాడు. అసలు సమాజం ఇట్లా తయారైంది.? జీవితభాగస్వామి అంటే కొందరు మగవాళ్లు అవసరాలు తీర్చే పనిమనిషి అని మాత్రమే భావిస్తున్నారు.
ఆడవారు శారీరంకా, మానసికంగా ధృడంగా ఉండాలి. చాలా వరకూ అలానే ఉంటున్నారు.. కానీ ఇప్పటికీ కొన్ని ప్రాంతాంల్లో.. చెప్పి వెళ్లాలి, చెప్పులేసుకెళ్లాలి, అణిగిమణిగి ఉండాలి, అందరూ చెప్పింది వినాలి, మహిళ జీవితం అంటే వంటిల్లు, భర్త ఇంతే అనుకుని వెనకబడిపోతున్నారు. సమానహక్కులు, స్వతంత్ర ఆలోచన ఇద్దరికీ ఉండాలి. అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది అంటారు. ఎవరికి తెలుసు.. అణుకువే, అణిచివేతో.. ఆకును అడిగే ఓపిక ఎవడికీ ఉండదు. సామెత బాగుంది కదా అని వాడేస్తారు.. అలా అణిగిమణిగి ఉంటే ఈ రోజుల్లో బతకడం చాలా కష్టం. మొదట్లోనే.. ఇలాంటి ప్రవర్తనలు ఎదురైనప్పుడు సీరయస్ యాక్షన్స్ తీసుకుంటే… ప్రాణాలు పోయేదాక రాదు అంటున్నారు నిపుణులు.
– Triveni Buskarowthu