రెండేళ్లు గడిచినా ప్రపంచాన్ని కరోనా మహమ్మారి విడవడం లేదు. రోజులు గడుస్తున్నా కొద్ది.. తన రూపాన్ని మార్చుకుని వ్యాధిని విస్తరించేలా చేస్తోంది. ఆల్ఫా, బీటా, డెల్టా, డెల్టా ప్లస్, ఓమిక్రాన్ రూపంలో వరసగా మానవాళిపై దాడులు చేస్తోంది. తాజాగా ఓమిక్రాన్ లోనే మరో వేరియంట్ ప్రస్తుతం ప్రపంచాన్ని కలవరపరుస్తోంది. ఓమిక్రాన్ మూల వేరియంట్ కన్నా ఎక్కువగా బీ.ఏ2 వేరియంట్ వ్యాపిస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇదిలా ఉంటే కొన్ని జన్యు లక్షణాల కారణంగా దీన్ని గుర్తించడం కూడా ఇబ్బందిగా మారింది. ఇప్పటికే 54 దేశాల్లో ఈ ఓమిక్రాన్ వేరియంట్ ఉపరకం బీ.ఏ.2 కేసులు నమోదవుతున్నాయి.
ఇప్పటికే ప్రపంచంలో పలు దేశాల్లో ఈ బీ.ఏ.2 వేరియంట్ కేసులు బయటపడ్డాయి. డెన్మార్క్ లో ప్రస్తుతం వస్తున్న కేసులు బీ.ఏ.2 వేరియంట్ కు చెందినవేె ఎక్కువగా ఉంటున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు సింగపూర్ లో కూడా ఈ వేరియంట్ కేసులు పెరిగాయి. ఓమిక్రాన్ వేరియంట్ కన్నా ఒకటిన్నర రెట్లు వేగంగా వ్యాప్తి చెందే లక్షణం బీ.ఏ.2 వేరియంట్ కు ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అయితే బీఏ1, బీఏ2 వేరియంట్లపై వ్యాక్సిన్ల సమర్థత ప్రభావవంతంగా ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.