ఓమిక్రాన్ నుంచి 104 మంది రికవరీ… కేంద్రం ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడి.

ఓమిక్రాన్ భారత్ ను కలవర పెడుతోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. దేశంలో ప్రస్తుతం కేసుల సంఖ్య 250ని దాటింది. దక్షిణాఫ్రికాలో మొదలైన ఈ వేరియంట్ ప్రస్తుతం 90కి పైగా దేశాలకు విస్తరించింది. ముఖ్యంగా యూకే, డెన్మార్క్ వంటి దేశాల్లో ప్రమాద ఘంటికలను మోగిస్తోంది. ఇదిలా ఉంటే యూకే, యూఎస్ఏ దేశాల్లో కరోనా మరణాలు కూడా సంభవించాయి. యూకేలో 12, యూఎస్ లో 01 మంది మరణించారు.

ఇదిలా ఉంటే దేశంలో ఓమిక్రాన్ బారిన పడిన వారు త్వరగానే కోలుకుంటున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి మరణం లేకపోవడం కాస్త ఉపశమనం కలిగించే వార్త. తాజాగా ఓమిక్రాన్ వేరియంట్ నుంచి 104 మంది రికవరీ అయ్యారు. ఓమిక్రాన్ వచ్చిన వారిలో స్వల్ప లక్షణాలు ఉండటంతో పాటు త్వరగా రికవరీ అవుతున్నారు. దేశంలో నిన్నటి వరకు 236 కేసులు నమోదయ్యాయి. అయితే నిన్న రాత్రి వరకు మరికొన్ని ఓమిక్రాన్ కేసులు కూడా నమోదవ్వడంతో ఈసంఖ్య 250ని దాటినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్ర, ఢిల్లీలు ఓమిక్రాన్ కేసుల్లో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లోనే రికవరీ ఎక్కువగా ఉంది. దీంతోె పాటు రాజస్థాన్, కర్ణాటకలో ఇప్పటికే చాలా మంది ఓమిక్రాన్ బారి నుంచి రికవరీ అయ్యారు.