రాజకీయాల్లో వ్యూహాలు కావాల్సిందే. వ్యూహకర్తలు కూడా కావాల్సిందే. అయితే.. రాజకీయ నేతలు వేసే వ్యూహాలు.. ఇటు ప్రజలకు, అటు పార్టీకి కూడా మేలు చేసేలా ఉండాలి. అదేసమయంలో నాయకులకు కూడా మంచి చేయాలి. కానీ, వైసీపీకి గత ఎన్నికల ముందు వ్యూహకర్తగా వ్యవహరించిన ప్రశాంత్ కిశోర్(పీకే) ఇచ్చిన వ్యూహాలతో తాము నలిగిపోతున్నామని అంటున్నారు వైసీపీ నాయకులు. అదేంటి? అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారా? ఇక్కడే ఉంది.. అసలు విషయం. ఎన్నికలకుముందు వ్యూహాలు ఇచ్చిన పీకే.. వైసీపీ అధికారంలోకి వచ్చేందుకు కొన్ని సూత్రాలు చెప్పారు.
ఆ సమయంలోనే అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అనుసరించాల్సిన వ్యూహాలపై దృష్టి పెట్టి ముం దుగానే క్లారిటీ ఇచ్చారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో వలంటీర్ వ్యవస్థ వచ్చింది. ఇక, ప్రజలకు ప్రభుత్వా నికి మధ్య.. స్పందన అనే కార్యక్రమం కూడా తెచ్చారు. అయితే.. ఇప్పుడు రెండే తమ పాలిట శాపంగా మారుతు న్నాయని అంటున్నారు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు. నిజానికి ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వారు.. ప్రజలకు అందుబాటులో ఉంటూ.. వారి సమస్యలు తెలుసుకుంటూ.. తమ ఇమేజ్‌ను తమ పార్టీ ఇమేజ్‌ను కూడా పెంచుకుంటారు.
అంటే.. నియోజకవర్గం స్థాయిలో ఎమ్మెల్యేలు, ఎంపీల మాటే చలామణి అవుతుంది. అయితే.. వలంటీర్ వ్యవస్థ కారణంగా.. ఎమ్మెల్యేలను, ఎంపీలను ప్రజలు పట్టించుకోవడం మానేశారు. ప్రభుత్వానికి ఏదైనా సమస్య చెప్పుకోవాలంటే.. స్పందన కార్యక్రమం ఉండనే ఉంది. ఇక, తమకు ఏదైనా పథకం అందాలం టే.. తెల్లవారుతూనే ఇంటికి వచ్చే వలంటీర్లు ఉన్నారు. దీంతో ఎమ్మెల్యేలతో కానీ, ఎంపీలతో కానీ.. ప్రజలకు రిలేషన్ తగ్గిపోయింది. ఒకప్పుడు.. ఎమ్మెల్యేల ఇంటి ముందుకు క్యూలు కనిపించేవి.
మాకు ఈ సమస్య ఉంది.. ఆ సమస్య ఉంది.. పరిష్కరించండి.. అంటూ ప్రజలు మొర పెట్టుకునేవారు. అయితే.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కేవలం వలంటీర్, స్పందన కార్యక్రమాల ద్వారా.. ప్రజలు తమ సమస్యలు పరిష్కరించుకుంటున్నారు. దీంతో తమకు ఎలాంటి గుర్తింపు లేకుండా పోతోందని.. అసలు నియోజకవర్గంలో ఉన్నా.. పట్టించుకునేవారు కరువయ్యారని.. ఇలాంటి సలహాలు ఇచ్చిన పీకేపై నిప్పులు చెరుగుతున్నారు.
ఏ పథకం ప్రారంభించినా.. నేరుగా సీఎం జగన్ ప్రారంభించడం.. వెంటనే బటన్ నొక్కగానే ఆన్‌లైన్‌లో లబ్ధి దారులకు నిధులు అందడం వంటి పరిణామాలు.. ఎమ్మెల్యేలకు, ఎంపీలకు ప్రాధాన్యం తగ్గించాయని లబోదిబో మంటున్నారు. అయితే.. ఈ వ్యవస్థల ద్వారానే ప్రభుత్వానికి మంచి ఫాలోయింగ్ పెరిగిందని.. ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. సో.. దీనిని బట్టి.. వీటిని వచ్చే మూడేళ్లు కొనసాగించడం ఖాయంగా కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు.