దేశీయ కంపెనీ ఓయో కీలక నిర్ణయం తీసుకుంది. టెక్నాలజీ టీమ్‌లలో 600 ఎగ్జిక్యూటివ్‌లను తొలగించనున్నట్లు పేర్కొంది. ఇప్పటికే జొమాటో, బైజూస్ వంటి కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. తాజాగా ఆతిథ్య సేవలు అందించే ఓయో సంస్థ సైతం ఉద్యోగులను తొలగించనున్నట్టు ప్రకటించింది. టెక్నాలజీ, కార్పొరేట్ విభాగానికి చెందిన 600 మంది ఉద్యోగులను తొగించబోతున్నట్టు తెలిపింది. ఇదే సమయంలో రిలేషన్ షిప్ మేనేజ్ మెంట్ టీమ్ లోకి కొత్తగా 250 మందిని తీసుకోనున్నట్టు వెల్లడించింది. తొలగించిన ఉద్యోగులకు 3 నెలల పాటు మెడికల్ ఇన్స్యూరెన్స్ కొనసాగుతుందని తెలిపింది. భవిష్యత్తులో ఉద్యోగ నియామకాలు చేపడితే తొలగించిన ఉద్యోగులకు ప్రాధాన్యతను ఇస్తామని పేర్కొంది. అలాగే సేల్స్ విభాగంలో 250 మంది ఎగ్జిక్యూటివ్‌లను నియమిస్తున్నట్లు కంపెనీ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది.
ఓయోలో ప్రధానంగా 3700 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వ్యాపార నిర్వహణ ఖర్చులను తగ్గించడానికి 10 శాతం ఉద్యోగాలు తగ్గించాలని కంపెనీ చూస్తోంది. దానిలో భాగంగా కంపెనీ ఇంజనీరింగ్, కార్పొరేట్ విభాగంలో టీమ్‌లను తగ్గిస్తోంది. అదే సమయంలో ప్రత్యేకంగా, వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడానికి దాని ప్లాట్‌ఫారమ్‌లోని హోటళ్లు, గృహాల సంఖ్యను పెంచడంలో సహాయపడటానికి రిలేషన్షిప్ మేనేజ్‌మెంట్ టీమ్‌లలో 250 మందిని కొత్తగా చేర్చుకోనుంది. గత రెండేళ్లలో OYO ఇలా ఉద్యోగులను తొలగించడం ఇది రెండోసారి. 2020 డిసెంబర్‌లో కంపెనీ 300 మంది ఉద్యోగులను తొలగించింది.