ఆర్థిక సంక్షోభంలో కొట్టిమిట్టాడుతున్న పాకిస్థాన్‌కు దెబ్బమీద దెబ్బ తగులుతోంది. విదేశీ మారక నిల్వలు క్షీణించడం పాక్‌కు శాపంగా మారింది. తాజాగా పాకిస్థాన్ రూపాయి విలువ జీవిత కాల కనిష్ఠానికి చేరుకుంది. మంగళవారం రోజున మార్కెట్ ముగిసే సమయానికి డాలరుతో పాకిస్థాన్ రూపాయి మారకం విలువ రూ.287.29కి పడిపోయింది.
ఐఎంఎఫ్ నుంచి 6.5 బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయం తీసుకోవడానికి 2019లోనే పాకిస్థాన్ అంగీకరించినా, ఆ సంస్థ పెట్టిన కఠిన షరతుల వల్ల వెనకడుగు వేసింది. ఐఎంఎఫ్ నిధులను విడుదల చేయాలంటే.. రూపాయిపై పాక్ ప్రభుత్వం నియంత్రణలను సరళీకరించాలని, రూపాయి మారకపు విలువను మార్కెట్ నిర్ణయించేలా చూడాలని ఐఎంఎఫ్ పాకిస్థాన్‌ను కోరింది. ఐఎంఎఫ్ షరతులకు అనుగుణంగా పన్నులు, ఇంధన ధరలను పెంచేందుకు పాక్ సమ్మతించింది. ఐఎంఎఫ్ వద్ద ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న 6.5 బిలియన్ డాలర్ల నిధుల విడుదలకు ఆమోదం తెలుపుతుందనే ఉద్దేశంతో పాకిస్థాన్ వెంటనే ఈ నిబంధనకు అంగీకారం తెలిపింది.