భారత పార్లమెంట్ పై ఉగ్రదాడికి 20 ఏళ్లు… వీర జవాన్ లకు నివాళులు అర్పించిని రాష్ట్రపతి, ప్రధాని.

భారత ప్రజాస్వామ్యానికి చిహ్నం అయిన పార్లమెంట్ పై ఉగ్రవాదులు దాడులకు తెగబడి 20 ఏళ్లు పూర్తయింది. లష్కరే తొయిబా(ఎల్​ఈటీ), జైష్ ఏ మహ్మద్ ఉగ్రసంస్థలకు చెందిన ఐదుగురు సాయుధులు 2001 డిసెంబర్ 13న పార్లమెంట్​పై దాడి చేశారు. పార్లమెంట్ కాంప్లెక్స్​లోకి చొరబడి విచక్షణా రహితంగా కాల్పులు చేశారు. దాడిని భారత భద్రతా సిబ్బంది విజయవంతంగా తిప్పికొట్టారు. ఈ కాల్పుల్లో 5 గురు ఉగ్రవాదులను మట్టుపెట్టారు. 9 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఓ పౌరుడు కూడా మరణించాడు. ఆ సమయంలో పార్లమెంట్​లో 100 మంది సభ్యులు ఉన్నారు.

తాజాగా ఈ దాడికి 20 ఏళ్లు పూర్తయింది. దీంతో ఆ నాటి ఘటనలో చనిపోయిన వీరులకు నివాళులు అర్పించారు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోదీలు. ’’2001లో ఈ రోజున, ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన పార్లమెంటును భయంకరమైన ఉగ్రవాద దాడికి వ్యతిరేకంగా రక్షించి తమ ప్రాణాలను అర్పించిన ధైర్యవంతులైన భద్రతా సిబ్బందికి నేను నివాళులర్పిస్తున్నాను. వారి అత్యున్నత త్యాగానికి దేశం వారికి ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటుంది‘‘ అంటూ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ట్విట్ చేశారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ట్విట్టర్ వేదికగా’’2001లో పార్లమెంట్ దాడి సమయంలో విధి నిర్వహణలో వీరమరణం పొందిన భద్రతా సిబ్బందికి నేను నివాళులర్పిస్తున్నాను. దేశానికి వారి సేవ మరియు అత్యున్నత త్యాగం ప్రతి పౌరుడికి స్ఫూర్తినిస్తూనే ఉంది.‘‘ అంటూ నివాళులు అర్పించారు.