బాబు ఉచ్చులో పవన్..వైసీపీ ట్రాప్..!

ఇప్పటివరకు పవన్ కల్యాణ్ టార్గెట్ గా విరుచుకుపడిన వైసీపీ నేతలు ఇప్పుడు రూట్ మారుస్తున్నారు..ఆయనపై జాలి చూపిస్తూ మాట్లాడుతున్నారు. పాపం పవన్‌ని చంద్రబాబు వాడుకుంటున్నారని, బాబు ఉచ్చులో పవన్ పడిపోయారని మాట్లాడుతున్నారు. అయితే ఇలా సడన్‌గా వైసీపీ నేతల వర్షన్ మారడానికి కూడా కారణాలు లేకపోలేదు…అసలు వైసీపీ టార్గెట్ వచ్చి..బాబుతో పవన్‌ని కలవనివ్వకుండా చేయడం.

బాబుతో పవన్ కలిస్తే వైసీపీకే రిస్క్ అనే సంగతి అందరికీ తెలిసిందే. గత ఎన్నికల్లో వారు విడిగా పోటీ చేయడం వల్ల చాలా స్థానాల్లో ఓట్లు చీలిపోయీ వైసీపీకి బెనిఫిట్ అయింది. ఇప్పుడు అలాగే వారు విడిగా ఉంటేనే తమకు బెనిఫిట్ అనేది వైసీపీ ఆలోచిస్తున్న వ్యూహం. కానీ పవన్ ఏమో బాబుకు దగ్గరవుతున్నట్లు కనిపిస్తున్నారు. అందుకే మొన్నటివరకు పవన్‌ని గట్టిగా టార్గెట్ చేసి..దమ్ముంటే 175 స్థానాల్లో పోటీ చేయాలని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు. వైసీపీ వ్యాఖ్యలని పవన్ పెద్దగా పట్టించుకోలేదు. తాను ఎలా చేస్తే వైసీపీకి ఎందుకని ప్రశ్నించారు.

అయితే తాజాగా వైసీపీ రూట్ మార్చింది..బాబు ఉచ్చులో పవన్ పడ్డారని జాలి చూపిస్తూ మాట్లాడుతున్నారు. తాజాగా ఇప్పటం ఘటన అంశంలో పవన్‌ని బాబు ఇరికించారని రోజా మాట్లాడారు. ఇప్పటికే విశాఖ ఎయిర్ పోర్టు ఘటనలో పవన్‌ను వాడుకున్న చంద్రబాబు.. ఇప్పటంలో తెలివిగా పవన్‌ను ఇరికించారని, ఇప్పటం ఉన్నది మంగళగిరి నియోజకవర్గంలో అని, అక్కడ పోటీ చేసేది చంద్రబాబు కొడుకు లోకేష్ అని, లోకేష్ కోసం పవన్‌ని పావులా వాడుకుంటున్నారని అన్నారు. ఎన్టీఆర్ ఫ్యామిలీని బాబు వాడుకుని కరివేపాకులా పడేశారని, ఇప్పుడు పవన్‌ని అలాగే చేస్తారని అంటున్నారు.

అయితే ఇక్కడ వైసీపీ వేరే వర్షన్ కనిపిస్తోంది..పవన్‌పై సానుభూతి చూపిస్తూ, బాబుకు దగ్గర అవ్వకూడదనే స్కేక్ కనిపిస్తోంది. అలాగే చంద్రబాబు పట్ల..జనసేన శ్రేణుల్లో ఇంకా నెగిటివ్ పెంచేలా చేస్తున్నారు. అంటే మా పవన్‌ని బాబు వాడుకుంటున్నారని కోపం జనసేన శ్రేణుల్లో వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. దీని బట్టి చూస్తే వైసీపీనే పెద్ద ట్రాప్ వేసినట్లు కనబడుతోంది.