జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమరావతి కోసం టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని, అమరావతిపై చిత్తశుద్ధి ఉంటే ప్రత్యక్ష పోరాటంలోకి రావాలని పిలుపునిచ్చారు. రాజధాని వికేంద్రీకరణ పేరిట మూడు ప్రాంతాల మధ్య చిచ్చురేపుతున్నారని పవన్ ఆరోపించారు. రాజధాని వికేంద్రీకరణపై న్యాయకోవిదులు, నిపుణులతో చర్చిస్తామని తెలిపారు. గతంలోనే మరో ప్రభుత్వం వచ్చినా రైతులకు అన్యాయం జరగకుండా చట్టం ఉండాలని జనసేన సూచించిందని పవన్ గుర్తు చేశారు.
ఆనాడు తమ పార్టీ మాటలను ఎవరూ పట్టించుకోలేదని, నేడు జరుగుతున్న పరిణామాలకు టీడీపీనే బాధ్యత వహించాలని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మాణాలను పూర్తి చేయకుండా మధ్యలోనే ఆపివేయడం టీడీపీ చేసిన అతి పెద్ద తప్పని పవన్ చెప్పుకొచ్చారు. అమరావతిలో ఇల్లు కట్టుకుని ఇక్కడే ఉంటానని ఎన్నికల ముందు చెప్పిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి.. ఇప్పుడు మాట మార్చి మోసం చేశారని పవన్ మండిపడ్డారు.