జనసేన పార్టీ ఆధ్వర్యంలో రెండో విడత జనవాణి కార్యక్రమాన్ని నేడు విజయవాడలో నిర్వహించారు. జనవాణి-జనసేన భరోసా పేరుతో అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జనసేనాని పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ప్రజల సమస్యలు తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందన్నారు. అంతేకాకుండా.. ఎవరన్నా చనిపోతే ఓ చిన్న పార్టీ అయిన మేమే ఐదు లక్షలు ఇస్తున్నాం… ప్రభుత్వం దగ్గర ఆ మాత్రం డబ్బు కూడా లేదా? ఏదన్నా మాట్లాడితే పూనకాలు వచ్చినట్టు ఊగిపోతూ బూతులు మాట్లాడుతున్నారు అంటూ పవన్ మండిపడ్డారు. పైగా కేశ సంపదను వివిధ రకాలుగా వాడుతున్నారు… కేశ సంపదను ఆ విధంగా పీక్కోవద్దమ్మా… ఉన్నదంతా ఊడిపోతుంది జాగ్రత్త అని వ్యాఖ్యానించారు పవన్.
ఇక భవన నిర్మాణ కార్మికుల అంశం కూడా కీలకమైందని, సమాజంలో 40 శాతం శ్రామికశక్తి కాగా, వాళ్లలో 4వ వంతు మేస్త్రీలు, పెయింటర్లు, ప్లంబర్లు ఇతర భవన నిర్మాణ కార్మికులు ఉంటారన్నారు పవన్. వాళ్ల సంక్షేమ నిధిలో రూ.918 కోట్లు ఉన్నాయని, ఇవాళ వాళ్లకి సంబంధించిన నిధులు ఆపేశారని మండిపడ్డారు జనసేనాని. ఇసుకను అడ్డగోలుగా దోచేస్తున్నారన్న పవన్ కల్యాణ్.. ఇసుక దొరుకుతుంది కానీ అంతా తమిళనాడుకు, కర్ణాటకకు వెళ్లిపోతుందని, ఇక్కడికొచ్చేసరికి ధర పెరిగిపోతోందని కొందరు తనతో చెప్పారన్నారు. ఎయిడెడ్ కాలేజీలు, స్కూళ్లకు ప్రభుత్వం సాయం చేయాలని, కానీ వాటికి కూడా అన్యాయం చేస్తోందన్న పవన్.. చాలా మంది ఉద్యోగాలు కోల్పోతున్నారన్నారు.