ఇల్లేమో దూరం.. అసలే చీకటి గాడాందకారం.. రోడ్డంతా గతుకులు.. చేతిలో దీపంలేదు.. కానీ గుండెల నిండా ధైర్యం ఉంది. ఇది పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో అత్యంత ఆవేశంగా, ఆయాసం వచ్చే స్థాయిలో చెప్పిన మాటలు! నిజంగా కూడా జనసేనకు ప్రారంభంనుంచీ పైన పవన్ చెప్పిన మాటల ప్రకారమే జరుగుతుంది. ఈ సమయంలో బీజేపీ – వైకాపా మధ్య జనసేనకు ఆ “దూరం” మరీ పెరిగిపోతుందా.. ఆ “చీకటి” మరీ గాండాందకారంగా మారబోతుందా.. పవన్ నడుస్తున్న “రోడ్డు” మరింత గతుకులు పడిపోనుందా.. చేతిలో “దీపం”??
పవన్ కల్యాణ్ కి కాస్త ఓపిక తక్కువ.. సహనం స్వల్పం.. ఆవేశం ఎక్కువ.. అప్పుడప్పుడూ ఆయసపడుతున్నట్లు కూడా కనిపిస్తుంటారు! ప్రస్తుతం రాజకీయవర్గాల్లో పవన్ గురించి నడుస్తున్న చర్చలు ఇలానే ఉన్నాయి. వచ్చిన కొత్తలో తొందరపడి “బాబుకు జై.. బాబు సీనియారిటీకి జై” అనేశారు. అనంతరం ఆటలో అరటిపండైపోయారు. తర్వాత ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేద్దామని నిర్ణయించుకున్నారు! అధికారంలోకి రావాలి అనుకుంటున్న పార్టీకి టార్గెట్.. అధికారపక్షం అవ్వాలి కానీ, తనదైన వ్యూహాల్లో భాగంగా ప్రతిపక్ష వైకాపాను టార్గెట్ చేశారు పవన్. ఫలితం గాజువాక, భీమవరం రూపంలో స్పష్టం!
2014లో బాబుకి సై అన్నట్లుగానే… ఆ పొత్తైనా జాగ్రత్తగా కాపాడుకుంటూ నిలుపుకుంటూ వచ్చి 2019లో మళ్లీ కలిసి పోటీచేసినా ఫలితాల్లో కచ్చితంగా మార్పు ఉండేది. పవన్ తొందరపడ్డారు… ఒంటరిగా దిగారు.. ఒక్కసీటుకే పరిమితమైపోయారు! వెంటనే బీజేపీతో పొత్తన్నారు… జనసేన పార్టీ అధ్యక్షుడి హోదాలో ఉండాల్సిన వ్యక్తి కాస్తా.. క్రమశిక్షణకలిగిన బీజేపీ కార్యకర్తగా మారిపోతున్నారు! తాజాగా… బీజేపీ కూడా పవన్ ని లైట్ తీసుకుంటుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి!
దానికి కారణం… గతకొన్నిరోజులుగా బీజేపీ – వైకాపా మధ్య రహస్య స్నేహం నడుస్తుందనే మాటలు వినిపించడమే. మూడు రాజధానుల విషయంలో బీజేపీ వైఖరే దానికి తాజా ఉదాహరణ అనేది విశ్లేషకుల మాట. దీంతో… .బీజేపీ వైకాపాలు బహిరంగంగా ప్రేమించుకున్నట్లు కనిపించకపోయినా… ఇలాంటి రహస్య స్నేహాలే మరికాస్త బలపడితే అప్పుడు జనసేన స్థానం ఎక్కడ? ఎందుకంటే… పవన్ కు అత్యంత ప్రధాన ప్రత్యర్ధి జగన్ అని అంటుంటారు!
అదే జరిగితే… బీజేపీ పెద్దలు, “పవన్ కోసం జగన్ ని వదులుకుంటారా – జగన్ కోసం పవన్ ని పక్కనేస్తారా” అనేది క్లిష్టమైన ప్రశ్నేమీ కాదు! అదే జరిగితే… “ఇల్లేమో దూరం.. అసలే చీకటి గాడాందకారం” కాదు “అంతకుమించే… ” అనేది విశ్లేషకుల మాట!!