ఏపీలో వాలంటీర్ల ద్వారా సంక్షేమ పథకాల లబ్దిదారుల సేకరణపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ మాటల దాడి చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోమారు వైసీపీ సర్కార్ పై విమర్శలు ఎక్కుపెట్టారు. వాలంటీర్లు సేకరిస్తున్న డేటా వైసీపీ నేతల చేతుల్లోకి వెళ్లడం వల్లే రాష్ట్రంలో మహిళలు కిడ్నాప్ కు గురవుతున్నారంటూ విమర్శిస్తున్న పవన్ .. రెండు రోజులుగా వరుస వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇవాళ హైకోర్టు గతంలో వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యల్ని కోట్ చేస్తూ ట్వీట్ చేశారు.
రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ అనవసరం అని, ఉన్న వ్యవస్థలను బలోపేతం చేయకుండా, అవసరంలేని వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చారని విమర్శించారు. వ్యక్తిగత సమాచారం సేకరించేందుకు వాలంటీర్లు ఎవరు? అని పవన్ ప్రశ్నించారు. వాలంటీర్లు సేకరించిన సమాచారాన్ని ఎక్కడ ఉంచుతున్నారు? అని నిలదీశారు. వాలంటీర్ల రూపంలో ప్రతి 50 ఇళ్లకు ఒక జగన్ తయారయ్యాడని వ్యాఖ్యానించారు. జగన్ అనే జలగలు వస్తుంటాయి, పోతుంటాయి… జగన్ వంటి వాళ్లు వచ్చినంత కాలం నాలాంటి వాళ్లు వస్తుంటారు అని వివరించారు.