తెలంగాణ రాజకీయాల్లో ఈటల రాజేందర్ మ్యాటర్ బాగా హాట్ టాపిక్ అవుతున్న విషయం తెలిసిందే. ఊహించని విధంగా భూకబ్జా ఆరోపణలతో మంత్రి పదవి నుంచి తొలగించబడ్డ ఈటల, హఠాత్తుగా టీఆర్ఎస్ని వదిలి బీజేపీలో చేరిపోయారు. అలాగే ఈటల తన ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేశారు. దీంతో హుజూరాబాద్ స్థానానికి ఉపఎన్నిక జరగనుంది.
ఈ ఉపఎన్నికలో సత్తా చాటాడానికి ఈటల అన్నీ రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటినుంచే హుజూరాబాద్‌లో గడపగడపకు వెళ్ళేందుకు సిద్ధమయ్యారు. ఎలాగైనా టీఆర్ఎస్ని ఓడించి, తన సత్తా ఏంటో చూపించాలని చూస్తున్నారు. అటు ఈటలకు చెక్ పెట్టి గులాబీ జెండా పవర్ ఏంటో చూపించాలని టీఆర్ఎస్ చూస్తుంది. ఇప్పటికే టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు హుజూరాబాద్‌లో మకాం వేసేశారు.
అటు బీజేపీ నేతలు సైతం హుజూరాబాద్‌లో ఈటలకు మద్ధతుగా ప్రచారం మొదలుపెట్టేశారు. ఈ క్రమంలోనే ఈటల విషయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్లాన్ ఎలా ఉండబోతుందనే విషయం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం బీజేపీతో జనసేన పొత్తులో ఉన్న విషయం తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లో జనసేన-బీజేపీలు పొత్తుతో ముందుకెళుతున్నాయి. కాకపోతే వీరి పొత్తు ఏపీలోనే బలంగా ఉంది. తెలంగాణలో జనసేనకు పెద్ద బలం లేదు. అందుకే ఆ పార్టీని బీజేపీ పెద్దగా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. అయితే ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పవన్ చివరి నిమిషంలో బీజేపీని కాదని, టీఆర్ఎస్కు మద్ధతు ఇచ్చారు. ఇక చివరికి టీఆర్ఎస్ అభ్యర్ధే విజయం సాధించారు.
దీంతో జనసేన విషయంలో బీజేపీ వైఖరి కాస్త మారినట్లు కనబడుతోంది. అయితే తెలంగాణలో జనసేనకు బలం లేకపోయినా, పవన్‌కు మాత్రం మంచి ఫాలోయింగ్ ఉంది. ఇక ఆ ఫాలోయింగ్‌ని క్యాష్ చేసుకోవాలంటే పవన్‌ని హుజూరాబాద్ ప్రచారంలో దించాలి. మరి పవన్‌ని ప్రచారానికి రమ్మని బీజేపీ ఆహ్వానిస్తుందో లేదో చూడాలి. అలాగే పవన్ సైతం ఈటలకు మద్ధతుగా ప్రచారానికి వస్తారో లేదో చూడాలి.