అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా.. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని టీఆర్‌ఎస్ వర్గాల్లో మాత్రం రాజకీయం ఇప్పటి నుంచే భగభగలాడుతోంది. టికెట్ కోసం అధికారపార్టీలో చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి టీఆరెస్సే అయినా.. ఆయనకు మళ్లీ టికెట్ కష్టమన్నది పార్టీలో మరో వర్గం అంచనా వేస్తోంది. ఈ మాటలు చెవిన పడ్డాయో ఏమో.. మనోహర్‌రెడ్డి సైతం ఇప్పటి నుంచే పావులు కదపడం మొదలుపెట్టారట. అదే ఇప్పుడు పెద్దపల్లి టీఆర్‌ఎస్ వర్గాల మధ్య అగ్గిరాజేస్తున్నట్టు తెలుస్తుంది.
దాసరి మనోహర్‌రెడ్డి రెండు పర్యాయాలు పెద్దపల్లి ఎమ్మెల్యేగా ఉంటున్నారు. ఆయనపై స్థానికంగా పార్టీలో వ్యతిరేకత కూడా అలాగే ఉంది. ఎమ్మెల్సీ భాను ప్రసాదరావు, టీఎస్ఐడీసీ చైర్మన్ ఈద శంకర్‌రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. వీరికి చెక్‌పెట్టాలనే దిశగానే పావులు కదుపుతున్నారట ఎమ్మెల్యే. ఒకవేళ తనకు టికెట్ నిరాకరిస్తే కోడలు మమతారెడ్డిని బరిలో నిలిపేలా వ్యూహ రచన చేస్తున్నారట. ఈ పరిణామాలు రుచించని పార్టీలోని వైరివర్గాలు ఎమ్మెల్యేపై కత్తులు నూరుతున్నాయట.
మమతారెడ్డి ప్రస్తుతం పెద్దపల్లి మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా ఉన్నారు. ఈ పదవి నుంచి ఎమ్మెల్యే పోస్ట్‌కు ప్రమోట్ చేసేలా పార్టీలో ఓ గ్రూపును రెడీ చేస్తున్నారట ఎమ్మెల్యే. మీతో నేను అనే కార్యక్రమం ద్వారా ఆమె ప్రజల్లోకి వెళ్లడం వెనక ఆయనే ఉన్నరట. ఈ కార్యక్రమం ఉద్దేశాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం గుర్రుగా ఉందట. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెటే లక్ష్యంగా పెద్దపల్లి టీఆర్‌ఎస్ నేతలు ఎవరికి వారుగా విడిపోయినట్టు సమాచారం. ఎవరి కార్యక్రమాలు వారివే. కలిసి సాగడం లేదు. వ్యక్తిగత అంశాలకు ఫోకస్ ఇస్తున్నారట. వచ్చే ఎన్నికల్లో తానే అభ్యర్థిని అని జనాల్లోకి వెళ్తున్నారు.
మొత్తానికి మామ ఎమ్మెల్యే… కోడలి పెత్తనంపై పెద్దపల్లిలో హాట్ టాపిక్‌గా మారింది. ఎమ్మెల్యేకు దీటుగా అసంతృప్తి వర్గం ఎత్తులు వేస్తుండటంతో రాజకీయాలు రసకందాయంలో పడుతున్నాయి.