ఏపీ ప్రజలకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. ప్రస్తుతం ఏపీలో ఉన్న విద్యుత్ కొరత తాత్కాలికమేనని.. త్వరలోనే కరెంట్ కోతలు తగ్గనున్నట్లు ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలక ప్రకటన చేశారు. పవర్ ఎక్చేంజ్ లో యూనిట్ రూ.12 నుంచి 16 వరకు ఉండగా, వ్యవసాయానికి పగటిపూట 9 గంటల చొప్పున పాతికేళ్ల పాటు ఉచిత విద్యుత్ అందించడం కోసం ‘సెకీ’ ద్వారా యూనిట్ కేవలం రూ.2.49కే కొనుగోలు చేయనున్నామని పేర్కొన్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.
శాశ్వత ప్రాతిపదికన నిరంతర విద్యుత్ సరఫరా కోసం విద్యుత్ సంస్థలు దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించాలని వెల్లడించారు. అనూహ్యంగా విద్యుత్ కొరత ఏర్పడినా, భవిష్యత్‌లో భారీగా డిమాండ్ ఏర్పడినా తట్టుకునేలా విద్యుత్ రంగాన్ని అధికారులు మరింత బలోపేతం చేయాలని స్పష్టం చేశారు పెద్దిరెడ్డి. ఆంధ్రప్రదేశ్‌లో మే నెల 15వ తేదీ నుంచి పవన విద్యుదుత్పత్తిని పెంచుతున్నాం.. దీంతో త్వరలోనే మరింత విద్యుత్ అందుబాటులోకొస్తుందని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు.