గురువారం సాయంత్రం
అది తూర్పుగోదావరి ప్రాంతం
ఉమ్మడి తూర్పుగోదావరి అని రాయాలి. ఎప్పటి నుంచో అక్కడేం వివాదాలున్నాయో లేవో కానీ పాపం దళితులపై ఇటీవల మాత్రం దాడులు జరిగాయి. మల్లాం గ్రామంలో అశాంతి రేగింది. అలజడి రేగింది. నిందితులను పట్టుకుని శిక్షించాల్సిన పోలీసులు ఇవేవీ పట్టని విధంగానే ఉన్నారు. దీంతో సమస్య పరిష్కరించేందుకు ఎస్సీ కమిషన్ వచ్చి అక్కడి డీఎస్పీ ని నిలదీసింది. శుక్ర వారం సాయంత్రంలోగా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పట్టుబట్టింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసి బాధ్యులకు సంబంధించి వివరాలు అన్నీ స్పష్టంగా అందులో పేర్కొని తమకు మెయిల్ చేయాలని లేదంటే తమకున్న విచక్షణాధికారాలు వినియోగించి పోలీసులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించి వెళ్లింది. ఆ వివరాలు ఈ వార్తా కథనంలో…
దళితులపై దాడులు ఆగడం లేదు. అదేవిధంగా దాడులు జరిపిన వారిపై శిక్షలు లేవు. కఠిన శిక్షలు ఉంటేనే సమస్య పరిష్కారానికి నోచుకుంటుంది కానీ ఆ విధంగా చర్యలు లేవు. దీంతో జగన్ సర్కారులో పనిచేసే పోలీసులు ఎప్పటికప్పుడు వివాదాల్లో ఇరుక్కుపోతున్నారే తప్ప సున్నితం అనుకునే సమస్యలకు పరిష్కారం చూపడం లేదు. ఈ నేపథ్యంలో ఎస్సీ కమిషన్ చైర్మన్ రంగంలోకి దిగి, నిన్నటి వేళ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
ఏపీ సర్కారులో మళ్లీ వివాదం రాజుకుంది. ఇక్కడి పోలీసు నిర్వాకంపై ఇప్పటికే అనుమానాలు విమర్శలూ రేగుతున్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, పిఠాపురంలో రేగిన వివాదం ఇప్పుడు మరింత రాజుకుంటోంది. ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్ అక్కడి నిన్నమొన్నటి వేళ మల్లాం గ్రామంలో దళితులపై జరిగిన దాడిపై స్పందించారు. క్షేత్ర స్థాయి విచారణకు వెళ్లారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 300 మందిపై దాడిచేస్తే 22 మందిని గుర్తించి అందులో ఆరుగురిపై మాత్రమే కేసులు నమోదు చేయడం ఏంటని డీఎస్పీని నిలదీశారు.