దేశంలో కరోనా కేసులు రోజు రోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ లాక్‌డౌన్‌ను మరికొద్ది రోజుల పాటు పొడిగిస్తారని తెలుస్తోంది. మే 17వ తేదీ వరకు ఉన్న లాక్‌డౌన్‌ను జూన్ 2వ తేదీ వరకు పొడిగిస్తారని సమాచారం. ఆ తేదీ వరకు వైరస్ 70 రోజుల సర్కిల్‌ను పూర్తి చేసుకుంటుంది. ఈ క్రమంలో వైరస్ ప్రభావం కొంత వరకు తగ్గేందుకు అవకాశం ఉంటుందని గతంలో పలువురు సైంటిస్టులు చెప్పిన నేపథ్యంలో ప్రధాని మోదీ లాక్‌డౌన్‌ను జూన్ 2వ తేదీ వరకు పొడిగిస్తారనే భావిస్తున్నారు.
కాగా తెలంగాణలో సీఎం కేసీఆర్ ఇది వరకే మే 29వ తేదీ వరకు లాక్‌డౌన్‌ను పొడిగించారు. తెలంగాణలో లాక్‌డౌన్ 3 రోజుల ముందుగా ప్రారంభమైంది కనుక.. 70 రోజుల సర్కిల్ ప్రకారం సీఎం కేసీఆర్ మే 29వ తేదీ వరకు లాక్‌డౌన్‌ను ప్రకటించారు. ఇక సోమవారం మోదీ సీఎంలతో జరిపిన వీడియో కాన్ఫరెన్స్‌లోనూ ఎక్కువ మంది సీఎంలు లాక్‌డౌన్‌ను పొడిగించాలనే మోదీని కోరారు. దీంతో లాక్‌డౌన్‌ను పొడిగిస్తారనే తెలుస్తోంది. అయితే లాక్‌డౌన్‌ను పొడిగించినా.. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేయనున్నాయి. ఈ మేరకు మరో విడత లాక్‌డౌన్‌లో ఇంకొన్నికార్యకలాపాలు నిర్వహించేందుకు గాను ఆంక్షలను సడలించవచ్చని తెలిసింది.
అయితే కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా అనే దేశాలు ఇప్పటికే భారీ స్థాయిలో ఆర్థిక ప్యాకేజీలను ప్రకటించినప్పటికీ భారత్ ఇంకా ఆ విషయంపై ఎలాంటి ప్రకటనా చేయలేదు. కానీ లాక్‌డౌన్‌ను మరోసారి పొడిగించే సందర్భంలో మోదీ ఈ విషయంపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే దేశంలోని అన్నివర్గాలను ఆదుకునే విధంగా ఒక ప్యాకేజీ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఆదుకునేందుకు మరొక ప్యాకేజీని కూడా కేంద్రం ప్రకటించవచ్చని సమాచారం. ఇక ఆ విషయాలు తెలియాలంటే.. అప్పటి వరకు వేచి చూడక తప్పదు..!