ఒకే ఒక్క ఎఫెక్ట్.. రాష్ట్ర బీజేపీ నేతలను డిఫెన్స్‌లో పడేసింది. ఇప్పటి వరకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అంటూ.. నిన్నమొన్నటి వరకు చెప్పుకొచ్చిన.. రాష్ట్ర బీజేపీ నేతలు ఇప్పుడు ఆ మాట మార్చక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. జగన్ సర్కారుపై ఇటీవల కాలంలో విమర్శలు చేస్తూ.. పుంజుకునేందుకు ప్రయత్నిస్తున్న రాష్ట్ర బీజేపీ నేతలు.. జగన్ ఏం చేస్తున్నా కేంద్రంలోని బీజేపీ సర్కారు చూస్తూ ఊరుకోదు.. అంటూ.. వ్యాఖ్యలు కుమ్మరించారు. అయితే, ఇప్పుడు హఠాత్తుగా మాట మార్చారు. కేంద్రంలోని ప్రభుత్వం వేరు.. పార్టీ వేరు.. అనే పరిస్తితి వచ్చింది.
వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నా.. వెంటనే పార్టీకి ముడిపెట్టి.. వైసీపీ నేతలు అందరూ ఇంతే.. అంటూ వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు బీజేపీకి ఎదురైన పరిస్థితితో వ్యాఖ్యలు మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంతకీ ఏం జరిగిందంటే..తాజాగా రాష్ట్ర రాజధానిపై కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. దీనిలో మూడు రాజధానుల విషయంలో ముందుకు సాగుతున్న జగన్‌కు పరోక్షంగా కేంద్రం మద్దతిచ్చినట్టుగా భావించాల్సి వస్తోంది.
దీనివల్ల ఇప్పటి వరకు బీజేపీ రాజధాని విషయంలో చేస్తున్న పోరు అనూహ్యంగా మసకబారే పరిస్థితి ఏర్పడింది. దీంతో బీజేపీని సమర్ధిస్తున్న ఏపీలోని ఎల్లో మీడియా సహా బీజేపీ నాయకులు కూడా అనూహ్యంగా మాట మార్చారు.రాజధాని విషయంలో కేంద్రం అఫిడవిట్ సమర్పించినప్పటికీ.. దానికి-బీజేపీకి సంబంధం లేదని కొత్త వ్యూహాన్ని తెరమీదికి తెచ్చారు. కేంద్రంలో ప్రభుత్వం వేరు.. పార్టీ వేరని.. కొత్త పల్లవి అందుకున్నారు.
మరి.. ఇన్నాళ్లకు కళ్లు తెరిచారని అనుకున్నా.. ఏపీ ప్రభుత్వం విషయంలో మాత్రం పార్టీని.. ప్రభుత్వాన్ని వేరు చేసి చూడకపోవడం గమనార్హం. కానీ, కేంద్రం ఒక అఫిడవిట్ దాఖలు చేసే సరికి తమకు ఎక్కడ ఎసరొస్తుందోనని భావించిన బీజేపీ సహా ఆ పార్టీని సమర్దిస్తున్న ఎల్లో మీడియా కూడా మాట మార్చడం.. రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీసిందనే చెప్పాలి. ఇక, ఈ రాజధాని ఎఫెక్ట్.. మున్ముందు ఇంకెన్ని మార్పులకు దారి తీస్తుందో చూడాలి.
-vuyyuru subhash