పదవ తరగతి బోర్డు ఎగ్జామ్స్ ప్రారంభంలోనే పరీక్షా ప్రశ్నాపత్రం వాట్సాప్ గ్రూపుల్లో ప్రత్యక్షం కావడం తీవ్ర కలకలం సృష్టించాయి. వికారాబాద్ జిల్లా తాండూరులోని ఓ కేంద్రం నుంచి తెలుగు పేపర్ లీకైనట్లు పోలీసుల దర్యాప్తులో తేలడంతో ఇందుకు బాధ్యులైన వారిని సస్పెండ్ చేశారు. తాజాగా టెన్త్ పేపర్ లీకేజ్ ఘటనలో ఎఫ్‌ఐఆర్‌లో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. టెన్త్ ప్రశ్నాపత్రం లీకేజీ ఘటనలో తాండూర్ ఎంఈఓ వెంకటయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన తాండూర్ పోలీసులు బండ్యప్ప, సమ్మప్పలను A1, A2 నిందితులుగా చేర్చి దర్యాప్తు చేస్తున్నారు.
తాండూర్ గవర్నమెంట్ స్కూల్‌లో పదో తరగతి పరీక్ష రాసేందుకు 260 మంది విద్యార్థులు ఉన్నారు. వారంతా 11 రూంలలో పరీక్షలు రాశారు. విధుల్లో మొత్తం 12 మంది ఇన్విజిలేటర్లు ఉన్నారు. వీరిలో రూమ్ నెంబర్ 5లో రిలీవర్‌గా ఉన్న బండ్యప్ప, అదే రూంలో అబ్సెంట్ అయిన విద్యార్థి క్వశ్చన్ పేపర్‌ను ఫోటో తీశాడు. మరో స్కూల్‌లో ఫిజిక్స్ టీచర్‌గా పని చేస్తున్న సమ్మప్పకు వాట్సప్ ద్వారా పంపించాడు.
అయితే వరంగల్ లో కూడా పదో తరగతి పరీక్ష పేపర్ లీకేజ్ ను పోలీస్ లు ఛేదించారు. కమలాపూర్ పరీక్ష కేంద్రంలోకి బాలుడు దూకి పేపర్ లాక్కొని ఫోటో తీసుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. బాలుడితో పాటు మరొకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎగ్జామ్ సెంటర్ చీఫ్ సూపరింటెండెంట్, ఇన్విజిలేటర్పై చర్యలకు అధికారులు సిద్దమయ్యారు.