ప్రాంతీయ పార్టీలు వారసత్వ రాజకీయాలకు కెరాఫ్ అడ్రస్. తండ్రి తర్వాత కొడుకుకే పార్టీ పగ్గాలు దక్కడం రివాజు. అధికారంలో ఉంటే అధికార పీఠం అందడం ఆనవాయితీ. ఇది దేశంలో ఏ రాష్ట్రంలో చూసినా నడుస్తున్న ట్రండ్. తెలంగాణ రాష్ట్రంలో ఇదే జరుగుతుందని అందరూ లెక్కలేసుకున్నారు. గత మూడేండ్లుగా సీఎం పీఠం కోసం ఎదురుచూస్తున్న చిన్న బాస్ కేటీఆర్‌కూ ఈ ఏడాదీ నిరాశే మిగిలింది. అదిగో ఇదిగో రేపు మాపు అంటూ ఊరించినా 2021లో మాత్రం అందకుండానే పోయింది.
తెలంగాణలో టీఆర్‌ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చింది. ఎన్నికలకు ముందు ఫెడరల్ ఫ్రంటూ కేసీఆర్ హడావుడి చేయడంతో కొడుకుకు అధికార మార్పిడి ఖాయమని అందరూ భావించారు. అనుకున్నట్టే టీఆర్‌ఎస్ పార్టీ పగ్గాలు కేటీఆర్‌కే దక్కాయి. ఆయన్ని వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించారు కేసీఆర్. ఇక తరువాయి సీఎం పదవే అనుకున్నారు.
2019 సార్వత్రిక ఎన్నికల్లో సారు కారు పదహారు సర్కారు నినాదంతో టీఆర్‌ఎస్ బరిలోకి దిగింది. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడితే చక్రం తిప్పొచ్చని భావించారు. కేసీఆర్ దేశ రాజకీయాలకు వెళ్తారని, కేటీఆర్ సీఎం అవుతారని అందరూ అనుకున్నారు. కానీ, సారు కారు పదహారు సర్కారు నినాదం బెడిసి కొట్టింది. టీఆర్‌ఎస్‌కు ఏడు సీట్లే దక్కాయి. కేంద్రంలో సంపూర్ణ మెజారిటీతో బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చింది. ఇక చేసేది లేక రాష్ట్ర రాజకీయాలకు కేసీఆర్ పరిమితం కావడంతో కేటీఆర్‌కు నిరాశే మిగిలింది. వరుసగా మూడో ఏడాది కూడా ఎదురు చూపులే దక్కాయి.
2001లో టీఆర్‌ఎస్ స్థాపించినప్పటి నుంచి కేసీఆర్‌తోపాటు హరీష్‌రావు కొనసాగుతూ వస్తున్నారు. 2004లో కేటీఆర్ రాజకీయ ప్రవేశం చేశారు. పార్టీలో వ్యవహారాలు నడపడంలో హరీష్‌రావుకు పట్టు ఉన్నది. ఆయనకు సొంత క్యాడర్ కూడా ఉన్నది. కేటీఆర్‌ను సీఎంను చేస్తే హరీష్‌రావు నుంచి ఇబ్బంది అయ్యే అవకాశాలు ఎంతో కొంత ఉన్నాయి. పార్టీలో చీలిక రావడానికి కూడా ఆస్కారం ఉన్నదని రాజకీయ వర్గాలు అభిప్రాయం.
మరో సీనియర్ నేత ఈటల రాజేందర్ టీఆర్ఎస్‌కు ఓనర్లం మేమే అనే నినాదాన్ని బలంగా వినిపించారు. కేటీఆర్ సీఎం పదవి చేపట్టడంలో ఆయనో అడ్డంకిగా మారాడనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇదంతా తెలిసిన కేసీఆర్ తనదైన శైలిలో ఆయన్ని పార్టీ నుంచి తప్పించారు. కేటీఆర్‌ను సీఎంను చేయడంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేశారు. కానీ, ఈటల రాజేందర్ వారసత్వ రాజకీయాలను బలంగా ప్రశ్నిస్తుండటం పెద్ద అడ్డంకిగా మారింది.
రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ దూకుడు పెంచింది. ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి దక్కింది. జాతీయ పార్టీలు రెండు కూడా తీవ్ర విమర్శలతో అధికార పార్టీపై విరుచుకుపడుతున్నాయి. ధర్నాలు, ఆందోళనలతో కాకా రేకిత్తిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో కేటీఆర్‌ను సీఎంగా నియమిస్తే మొదటికే మోసం వస్తుందని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తున్నది. అదీ కూడా కేటీఆర్‌కు నిరాశ ఎదురుకావడానికి కారణంగా సమాచారం.