బెజవాడ రాజకీయం మళ్లీ వేడెక్కింది. వివాదం మళ్లీ రచ్చకెక్కింది. ఈ నేపథ్యాన బెజవాడలో ఆ రెండు వర్గాల మధ్య కొట్లాట మళ్లీ తార స్థాయికి చేరుకోనుంది. అటు వల్లభనేని వంశీ మోహన్, ఇటు యార్లగడ్డ వెంకట్రావ్ మధ్య వైరం సీఎం వరకూ చేరింది. అయితే తనను ఏమన్నా ఇంతకాలం సహించానని ఇకపై భరించబోనని, డొక్కలు పగులుతాయ్ అని ప్రత్యర్థి వర్గాలను ఉద్దేశించి వంశీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇక్కడి రాజకీయ వర్గాల్లో మళ్లీ ఆ రెండు వర్గాల వైరం గురించే చర్చలు నడుస్తున్నాయి.
కొంత కాలంగా వంశీ సైలెంట్ అయిపోయారు. నారా భువనేశ్వరిని ఉద్దేశించి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆరోపణల కారణంగా టీడీపీ నాయకులపై ఏ మాటలూ అనకుండా ఆగిపోయారు. అందులో తన తప్పు ఉండే ఉంటుంది లేదా మిస్ కమ్యూనికేషన్ జరిగి ఉంటుందని కూడా ఒప్పుకున్నారు. ఆఖరికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరికి క్షమాపణలు కూడా ఓ ఛానెల్ ద్వారా చెప్పారు. అక్కడితో ఆ కథ సుఖాంతం అయినా ఆ వ్యాఖ్యల ప్రభావం రేపటి వేళ ఉండబోదని మాత్రం అనలేం.
ఇక తాజాగా గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో కూడా వంశీనే దూసుకుపోతున్నారు. వైసీపీ అనుబంధ సభ్యుడిగా ఉన్న ఈ గన్నవరం ఎమ్మెల్యే తనదైన శైలిలో సీఎం ఆదేశాల మేరకు నియోజకవర్గంలో పథకాల లబ్ధిదారులను కలుస్తూ, క్షేత్ర స్థాయిలో వాస్తవాలు తెలుసుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇదే ఇప్పుడు వైరి వర్గానికి కంటగింపుగా ఉంది. దీంతో ఆయనపై కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. గతంలో వంశీ చేపట్టిన మట్టి పనుల్లో అక్రమాలు జరిగేయని ఆరోపిస్తూ సీఎం వరకూ వివాదాన్ని మోసుకువెళ్లే ప్రయత్నం ఒకటి చేస్తూ ఉన్నారు. దీనిపైనే ఇవాళ వంశీ కౌంటర్ ఇచ్చారు. తన స్థాయికి తగని వ్యక్తులు ఆరోపణలు చేస్తూ పోతే ఊరుకునేది లేదని హెచ్చరించారు. మట్టి తవ్వకాలు తరువాత తరలింపు తదితర పనులపై వివరణ ఇచ్చారు. ఆ పనుల్లో తమకేమీ మిగిలేది ఉండనే ఉండదని, ఇలాంటి ఆరోపణలు వాస్తవ దూరం అని, నిర్హేతుకమని తోసిపుచ్చారు.