ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ తరఫున పోటీ చేసే అభ్యర్ధుల జాబితా ఖరారైంది. కేంద్ర నాయకత్వం ఆమోదం కోసం పురంధేశ్వరి ఢిల్లీ వెళ్లారు. కొన్ని చోట్ల సీట్ల పంచాయతీ ఉన్నప్పటికీ… అంతిమంగా అధినాయకత్వం ఆదేశాలను పాటించాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. అభ్యంతరాలు ఉన్నప్పటికీ.. పొత్తు ధర్మం పాటించి.. ఇతర సహచర పార్టీలకు సహకారం అందించాలని సూచించారు.
ఎన్నికల కదన రంగంలోకి దిగేందుకు కాషాయ దళం సిద్దమైంది. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి… ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను సిద్దం చేశారు. కేంద్ర నాయకత్వం అంతిమంగా ఆమోదం కోసం ఢిల్లీ వెళ్లారు. టీడీపీ, జనసేనతో పొత్తు కుదరడంతో.. బీజేపీకి పది ఎమ్మెల్యే, 6 పార్లమెంటు స్థానాలను కేటాయించారు. అయితే ఎంపీ సీట్ల విషయంలో బీజేపీ ముఖ్య నాయకులు పోటీ పడటంతో.. అభ్యర్దుల ఎంపిక కష్టంగా మారింది. మరోవైపు పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా కొన్నింటిపై రాష్ట్ర బీజేపీలో కొంతమంది నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. కొన్ని సీట్లు మార్చాలనే ప్రతిపాదనను కూడా తెరపైకి తెచ్చారు.
అయితే ఈ విషయంలో కేంద్ర బీజేపీ పెద్దలు మాత్రం ఆమోదముద్ర వేయలేదని తెలుస్తుంది. సీట్లు కేటాయింపునకు ముందు కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ విజయవాడలో మకాం వేసి మరీ సీట్ల ఎంపికపై టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లతో పలు మార్లు చర్చలు జరిపారు. బీజేపీకి కేటాయించిన నియోజకవర్గాల్లో పరిస్థితులు, అభ్యర్దుల గురించి కూడా చర్చించాకే.. ఫైనల్ గా స్థానాలను ప్రకటించారు. ఆ తర్వాత కొంతమంది బీజేపీ రాష్ట్ర నేతలు కొన్ని స్థానాలు మార్చాలని, అక్కడ గెలిచే అవకాశాలు లేవని అభిప్రాయాలు వ్యక్తం చేశారు.
అయితే ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ రావడం, ఇక ప్రజా క్షేత్రంలో ప్రచారానికి సిద్దం కావాల్సి ఉండటంతో.. నిర్ణయించిన స్థానాలపైనే ఫోకస్ పెట్టి… సాధ్యమైనంత వరకు బలమైన అభ్యర్దులను ఎంపిక చేయాలని కేంద్ర పెద్దలు రాష్ట్ర నేతలను ఆదేశించారు. దీంతో రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పది అసెంబ్లీ స్థానాలలో ఆశావహులతో మాట్లాడి… అన్ని విధాలా బలం అనుకున్న అభ్యర్దుల జాబితాను సిద్దం చేశారు..
ఇక ఎంపీ అభ్యర్దుల ఎంపిక మొత్తం కేంద్ర పెద్దలే నిర్ణయిస్తున్నారు. ఎమ్మెల్యే, ఎంపీ స్థానాల్లో కొన్ని సీట్ల విషయంలో అభ్యంతరాలు ఉన్నా.. ఈదశలో మార్పు అసాధ్యమని బీజేపీ నేతలే అంటున్నారు. ఇప్పటికే చిలకలూరిపేటలో నిర్వహించిన ప్రజాగళం సభ విజయవంతం కావడంతో బీజేపీలో కొత్త జోష్ వచ్చింది. ఇక ఆలస్యం చేయకుండా అభ్యర్దులను ప్రకటించి, ప్రజల్లోకి వెళ్లేలా కార్యాచరణ సిద్దం చేయనున్నారు. కేంద్ర పెద్దలు ఆమోదం తెలిపిన వెంటనే ఈనెల 21వ తేదీ నాటికి బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేల అభ్యర్ధులను ప్రకటించే అవకాశం ఉందంటున్నారు.
మరోవైపు టీడీపీ, జనసేన కూడా పెండింగ్ లో ఉన్న ఎమ్మెల్యే అభ్యర్దులను ప్రకటించి, ఆ తర్వాత మూడు పార్టీల నేతలు కలిసి ప్రచార ర్యాలీలు, సభలు నిర్వహించే విధంగా ప్రణాళిక సిద్దం చేస్తున్నారు. మొత్తం మీద వచ్చే వారం నుంచి బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల నేతలు ప్రజాక్షేత్రంలోకి వెళ్లి వైసీపీ అవినీతి, జగన్ మాట తప్పి మడమ తిప్పిన వైనాన్ని ఎండగట్టేందుకు సిద్దమవుతున్నారు.