ఏపీలో జగన్ ప్రభుత్వం సంక్షేమ పథకాల పేరుతో ప్రజలకు పెద్ద ఎత్తున డబ్బులు ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే జగన్ ప్రభుత్వం ఏ స్థాయిలో డబ్బులు ఇస్తుందో, అంతకంటే పదిరెట్లు ఎక్కువగా పన్నుల రూపంలో ప్రజల దగ్గర నుంచి లాగేస్తుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అసలు జగన్ ఆదాయం సృష్టించే మార్గాలు చూడకుండా ఎంతసేపు అప్పులు చేసి పథకాలు ఇవ్వడం వల్ల ప్రజలపై భారం పెరిగిపోయిందని అంటున్నారు.
జగన్ అధికారంలోకి వచ్చాక ప్రజలకు వరుస పెట్టి షాకులు తగులుతూనే ఉన్నాయని టీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. కరెంట్ బిల్లులు పెంచారు…ఇంటి పన్ను పెంచారు…పెట్రోల్, డీజిల్‌లపై బాదుడే బాదుడు….ఇసుక సామాన్యుడుకు అందుబాటులో లేదు. నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుకున్నాయి. మద్యపానం అంటూ ధరలు పెంచి, నాసిరకం మద్యం ఇస్తూ మందుబాబులకు చుక్కలు చూపిస్తున్నారు. ఇలా ఒకటి ఏంటి ప్రతి అంశంలోనూ జగన్ ప్రభుత్వం, ప్రజలకు షాకులు ఇస్తూనే ఉంది.
ఈ షాకులతోనే ఇబ్బంది పడుతుంటే జగన్ ప్రభుత్వం ఇటీవల ఆస్తిపన్ను పెంచింది. చెత్తకు, బాత్‌రూమ్‌లకు పన్ను వసూలు చేస్తూ ప్రజల నడ్డి విరుస్తున్నారని ప్రతిపక్షాలు ఫైర్ అవుతున్నాయి. నివాస గృహాల ఆస్తి విలువపై 0.15 శాతం, వాణిజ్య సంస్థలు, నివాసేతర భవనాలపై 0.3 శాతం, ఖాళీ స్థలాలపై 0.5 శాతం పన్ను పెంచింది. పైగా ఆస్తి విలువ బట్టి ఆస్తిపన్ను వసూలు చేస్తారు. అంటే ఒక సంవత్సరం ఆస్తి విలువ ఒకలా ఉంటే, నెక్స్ట్ సంవత్సరం ఆస్తివిలువ పెరుగుతుంది. అంటే ఆస్తిపన్ను కూడా పెరుగుతుంది.
ఇదే గాక తాజాగా జగన్ ప్రభుత్వం ప్రజలకు మరో బంపర్ ఆఫర్ ఇచ్చింది. ‘అమృత్’ పథకంలో భాగంగా రాష్ట్రంలో నీటి మీటర్లను ఏర్పాటు చేసేందుకు జగన్ ప్రభుత్వం సిద్ధమైంది. ఇదే జరిగితే.. ప్రతి నీటి బొట్టుకు లెక్కలు గట్టి ప్రజల నుంచి పన్ను వసూలు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ విధంగా ప్రజలకు, జగన్ అదిరిపోయే షాకులు ఇస్తున్నారని టీడీపీ ఫైర్ అవుతుంది.