వరుసగా పార్టీలు మారడం..విజయాలు సాధించడం రాజకీయాల్లో కొందరికే సాధ్యమవుతుంది. అలాంటి వారిలో టిడిపిలో గంటా శ్రీనివాసరావు, వైసీపీలో అవంతి శ్రీనివాస్ ఉన్నారు. ఇద్దరు గురు శిష్యులే. గంటా రాజకీయాల గురించి అందరికీ తెలిసిందే. ఆయన టిడిపి, ప్రజారాజ్యం, కాంగ్రెస్, టిడిపి ఇలా పార్టీలు మారిన విజయాలు సాధిస్తూనే వస్తున్నారు. ఆయన గురించి పక్కన పెడితే…గంటా శిష్యుడు కూడా అదే బాటలోనే వస్తున్నారు. ఇప్పటివరకు ఆయన మూడు పార్టీలు మారారు. మూడుసార్లు గెలిచారు.
ముత్తంశెట్టి శ్రీనివాస్..అవంతి విద్యాసంస్థల అధినేత. అందుకే ఆయనకు అవంతి శ్రీనివాస్ అని పేరు వచ్చింది. సరే ఈయన రాజకీయంగా ప్రజారాజ్యంతో ఎంట్రీ ఇచ్చారు. 2009 ఎన్నికల్లో భీమిలి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. తర్వాత ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనం కావడంతో ఆ పార్టీలో కొన్ని రోజులు ఉన్నారు. ఇక 2014 ఎన్నికలకు వచ్చేసరికి. తన గురువు గంటాతో కలిసి టిడిపిలోకి వచ్చారు. ఆ ఎన్నికల్లో టిడిపి నుంచి అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. ఇక ఐదేళ్ల పాటు అధికారంలో కొనసాగారు.
సరిగ్గా ఎన్నికల ముందు అవంతి పార్టీ మారిపోయారు. వైసీపీలోకి జంప్ కొట్టి..2019 ఎన్నికల్లో భీమిలి నుంచి గెలిచారు. అలాగే మొదట విడతలో మంత్రిగా చేశారు. మంత్రిగా పెద్దగా రాణించలేదు. అనేక వివాదాల్లో చిక్కుకున్నారు. తర్వాత పదవి పోయింది. ఎమ్మెల్యేగా కూడా పాజిటివ్ లేదు. అయితే ఈ సారి ఆయన పార్టీ మారతారా? లేదా? వైసీపీలోనే ఉంటారా? అనేది సస్పెన్స్ గానే ఉంది. వైసీపీలో ఉంటూ భీమిలిలో పోటీ చేస్తే ఈ సారి గెలుపు డౌటే. ఎందుకంటే అటు వైపు టిడిపి-జనసేన కలిసి బరిలో ఉంటాయి.
గత ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలి అవంతి గెలిచారు. ఈ సారి ఛాన్స్ లేదు. ఒకవేళ టిడిపి లేదా జనసేనలోకి వెళితే ఏ సీటు దక్కుతుందో తెలియదు. మరి చూడాలి అవంతి మళ్ళీ పార్టీ మారి నాల్గవ విజయం అందుకుంటారా? మారకుండా గెలుస్తారో.