రా..! ఆసుపత్రులు తిరుగుదాం… సీఎస్‌కు భట్టి సవాల్

-

క‌రోనా బారిన ప‌డి రాష్ట్ర‌మంతా అత‌లాకుత‌లం అయిందని సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి పెరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం నిద్రపోతుందని విమర్శించారు. క‌రోనా బాధితులు ఆక్సిజన్ లేక చనిపోతున్నారని, ఆస్పత్రుల్లో బెడ్లుంటే ఇంజెక్షన్ ఉండడం లేదని, ఇంజెక్షన్ ఉంటే ఆక్సిజన్ అందుబాటులో లేదని, వెంటిలేటర్లు ఉన్న చోట టెక్నీషయన్లు లేరని అన్నారు. టెస్టులు సరిగాచేయడం లేదని, వ్యాక్సిన్ పంపిణీ కూడా సరిగ్గా జరగడం లేదని అన్నారు.

కరోనా సంక్షోభంలో యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాల్సింది పోయి, అర్ధాంతరంగా ఆరోగ్య మంత్రిని తీసేశారని మండిపడ్డారు. సీఎం తన దగ్గర వైద్య, ఆరోగ్య శాఖ పెట్టుకుని ఏం రివ్యూ చేశారని భ‌ట్టి ప్రశ్నించారు. కరోనా నీ ఆరోగ్య శ్రీ లో చేర్చుతామని శాసన సభలో మాటిచ్చిన ముఖ్యమంత్రి దానిని మరిచిపోయారని మండిపడ్డారు. కరోనాపై సీఎం ఏడాది క్రితం వేసిన టాస్క్ ఫోర్స్ ఎటు పోయిందని ప్రశ్నించారు. సీఎం ముందు బయటకు వచ్చి ప్రజల పరిస్థితి అర్దం చేసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు.

ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి (సీఎస్) సోమేశ్ కుమార్ పై కూడా భట్టి విమర్శలు చేసారు. రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో మందులు, ఆక్సిజ‌న్‌ సహా అన్నీ ఉన్నాయ‌ని సీఎస్ అన్న వ్యాఖ్యలను గుర్తు చేసిన భట్టి బాధ్యత గలిగిన అధికారి అబద్ధాలు చెప్పడం ఎంటి అని ఫైర్ అయ్యారు. అన్ని బాగుంటే ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో అంబులెన్స్ లు ఎందుకు సమయానికి అందుబాటులో లేవో చెప్పాలన్నారు. రా ఆసుపత్రులు తిరుగుదాం..! అని సీఎస్‌కు భట్టి సవాల్ విసిరారు. జనం సొమ్ముతో జీతాలు తీసుకునే మీరు… ప్రజలు సేవ చేయకుండా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. సీఎస్‌ తప్పుడు సమాచారం ఇచ్చి ప్రజలకు ఇబ్బంది పెట్టొద్దని అన్నారు.

ప్రైవేట్ ఆసుపత్రులకు ఫీజులు ఖరారు చేయాలని.. ప్రజలను దోపిడీ చేసే ఆస్పత్రులపై వెంటనే చర్యలు తీసుకోవాలని భట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. ప్రభుత్వానికి సహకరించడానికి తాము సిద్దంగా ఉన్నామని, సీఎం ముందు బయటకు వచ్చి అన్ని పార్టీలను కలుపుకుని పోవాలని సూచించారు. కరోనా మీద కలిసి కట్టుగా యుద్ధం చేద్దామని పిలుపునిచ్చారు.

 

Read more RELATED
Recommended to you

Latest news