తెలంగాణలో బిఆర్ఎస్, బిజేపిల మధ్య ఫ్లెక్సీ వార్ ఏ మాత్రం ఆగడం లేదు. ఓ వైపు నోటికి పనిచెబుతూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూనే..మరోవైపు ఫ్లెక్షీలు, పోస్టర్లలో సైతం రాజకీయ విమర్శలు చేసుకుంటున్నారు. ఎప్పటినుంచో ఫ్లెక్సీ వార్ కొనసాగుతూనే ఉంది. మునుగోడు ఉపఎన్నికలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి 10 వేల కోట్ల కాంట్రాక్టులు వచ్చాయని బిఆర్ఎస్ శ్రేణులు ప్రచారం చేసిన విషయం తెలిసిందే.
ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత ఉండటంతో ఆమెని ట్రోల్ చేస్తూ బిజేపి ఫ్లెక్సీలు వేసింది. ఇదే సమయంలో రాష్ట్రానికి కేంద్రంలోని బిజేపి నేతలు ఎవరైనా వస్తుంటే వారికి వ్యతిరేకంగా బిఆర్ఎస్ నేతలు ఫ్లెక్సీలు వేస్తున్నారు. ఈ మధ్య బిజేపి ఎంపీ ధర్మపురి అరవింద్..తీసుకొచ్చిన పసుపు బోర్డు ఇదే అంటూ ఒక పసుపు కలర్ ఉన్న బోర్డుని నిజామాబాద్ రోడ్లపై పెట్టారు. దానికి కౌంటరుగా కేసిఆర్ ఇచ్చిన నిరుద్యోగ భృతి, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవే అంటూ బిజేపి పోస్టర్లు వేసింది.
ఇలా రెండు పార్టీల మధ్య రచ్చ నడుస్తుంది. ఇక తాజాగా మోదీ హైదరాబాద్‌కు రానున్న నేపథ్యంలో బిఆర్ఎస్ నేతలు..మోదీకి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మోదీజీ.. పరివార్ మీకు స్వాగతం పలుకుతోందంటూ టివోలి రోడ్డులో ఓ హోర్డింగ్‌కు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. రాజకీయాలు, ఇతర రంగాల్లో ఉన్న బీజేపీలోని కీలక నేతలు, వారి తనయులు, కుమార్తెల ఫొటోలు ఫ్లెక్సీల్లో ముద్రించారు.
అయితే బీఆర్ఎస్ కుటుంబ పార్టీ అని ప్రధానితోపాటు బీజేపీ నేతలు విమర్శిస్తున్న నేపథ్యంలో.. కమలం పార్టీలోనూ వారసులని టార్గెట్ చేస్తూ ఫ్లెక్సీలు వేశారు. అటు బీజేపీ నేతల అవినీతికి సంబంధించి పలు పత్రికల్లో వచ్చిన కథనాల శీర్షికలతో మరో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఇలా హైదరాబాద్ లో బస్తీమే సవాల్ అంటూ బిఆర్ఎస్ నేతలు ఫ్లెక్సీలు పెడుతున్నారు. మరి వీటికి బిజేపి ఎలా కౌంటర్లు ఇస్తుందో చూడాలి.