కమలంపై కారు ఎటాక్..డ్యామేజ్ కంట్రోల్?

గత కొన్ని రోజులుగా టీఆర్ఎస్, బీజేపీల మధ్య రాజకీయ యుద్ధం తీవ్ర స్థాయిలో నడుస్తున్న విషయం తెలిసిందే..ఇక ఈ యుద్ధం కాస్త ఇప్పుడు మరీ తీవ్రతరమైంది…ఎప్పుడైతే మోదీ తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చారో..అప్పటినుంచి రచ్చ మరింత పెరిగింది. రెండు పార్టీల నేతలు మాటల తూటాలతో యుద్ధం మొదలుపెట్టేశారు. అప్పటికే విపక్షాల రాష్ట్రపతి అభ్యర్ధి యశ్వంత్ సిన్హా ప్రచారంలో పాల్గొన్న కేసీఆర్…మోదీపై విరుచుకుపడిన విషయం తెలిసిందే.

ఇక కేసీఆర్ కు…బీజేపీ నేతలు వరుసపెట్టి కౌంటర్లు ఇచ్చేశారు..దీంతో కేసీఆర్ కామెంట్ల పవర్ ని చాలా వరకు తగ్గించారు. అదే సమయంలో తాజాగా పరేడ్ గ్రౌండ్ లో జరిగిన విజయ్ సంకల్ప్ సభలో మోదీ తనదైన శైలిలో మాట్లాడి..తెలంగాణలో విజయం దిశగా కమలం పయనిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. కానీ విచిత్రం ఏంటంటే..మోదీ ఎప్పటిలాగానే..వ్యక్తుల పేర్లు ఎత్తకుండా…కౌంటర్లు ఇచ్చారు. కేసీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసినా సరే మోదీ…కేసీఆర్ పేరు గాని, టీఆర్ఎస్ పేరు గాని ఎత్తకుండా తనదైన శైలిలో కౌంటర్లు వేసేశారు.

అలాగే ఆయన ఎక్కువగా అభివృద్ధిపై మాట్లాడి…తెలంగాణలో పార్టీ గెలవబోతుందనే అంశాన్ని ప్రస్తావించారు. తాను శాశ్వత ప్రధానినన్న భావనలో మోదీ ఉన్నారని, కానీ, మార్పు తథ్యమని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కూడా మోదీ ఏ మాత్రం స్పందించలేదు…కేవలం తెలంగాణకు కేంద్రం ఏం సాయం చేసిందనే విషయంపైనే ఎక్కువ ఫోకస్ చేసి మోదీ ముందుకెళ్లారు.

మోదీ డైరక్ట్ విమర్శలు చేయకపోవడంతో బీజేపీ శ్రేణులే కాదు…టీఆర్ఎస్ శ్రేణులు సైతం ఆశ్చర్యపోయాయనే చెప్పొచ్చు. అయితే మోదీ డైరక్ట్ గా విమర్శలు చేయకపోవడం మంచిదే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గల్లీ లీడర్లు మాదిరిగా మాట్లాడకుండా హుందాగా మాట్లాడారని అంటున్నారు. అలాగే విజయ్ సంకల్ప్ సభపై టీఆర్ఎస్ నేతలు వరుసపెట్టి మీడియా సమావేశాలు పెట్టి విమర్శలు చేశారు. విజయ్ సంకల్ప్ సభ విజయం అయిన విషయాన్ని ప్రజల్లోకి పూర్తిగా వెళ్లనివ్వకుండా చేయాలని ప్రయత్నించినట్లు కనిపించింది. కానీ టీఆర్ఎస్ నేతలు గల్లీ లీడర్లు మాదిరిగానే మాట్లాడి..బీజేపీ సభ మరింత విజయమైందనే విధంగా హైలైట్ చేశారు. మొత్తానికి బీజేపీ సభ ద్వారా టీఆర్ఎస్ పార్టీకి డ్యామేజ్ పెరిగిందనే చెప్పొచ్చు.