పీకే సర్వే: కారుకు కారే శత్రువు?

తెలంగాణలో ఎన్నికల హడావిడి మొదలైన విషయం తెలిసిందే…రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయో తెలియదు గాని…పార్టీలు మాత్రం ఎన్నికల మూడ్ లోనే ఉన్నాయి. ముందస్తు ఎన్నికలు జరుగుతాయా? లేక యథావిధిగా షెడ్యూల్ ప్రకారం జరుగుతాయా? అనేది క్లారిటీ రావడం లేదు. కానీ ప్రతిపక్షాలైన కాంగ్రెస్, బీజేపీలు మాత్రం ముందస్తు ఎన్నికలు జరుగుతాయని చెబుతున్నాయి. అందుకు తగ్గట్టుగానే రాజకీయం చేస్తున్నాయి. అటు అధికార టీఆర్ఎస్ ఏమో ముందస్తు ఎన్నికలు లేవని చెబుతూనే…బ్యాగ్రౌండ్ లో ఎన్నికలకు ప్రిపేర్ అయిపోతుంది.

అంటే మొత్తానికి అన్నీ పార్టీలు ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా రాజకీయం చేస్తున్నాయి. అయితే మూడోసారి అధికారం దక్కించుకోవడం కోసం కేసీఆర్…రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సాయం తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పీకేకు సంబంధించిన ఐప్యాక్ సంస్థ తెలంగాణలో పనిచేయడం మొదలుపెట్టేసింది..నియోజకవర్గాల వారీగా రాజకీయ పరిస్తితులపై సర్వేలు కూడా చేస్తుంది. అయితే ఆ మధ్య ఐప్యాక్ సర్వేలో నలభై మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత ఉన్నట్లు తేలిన విషయం తెలిసిందే.

ఇక తాజాగా కొంతమంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్నా సరే…మళ్ళీ టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ఐప్యాక్ సర్వేలో తెలినట్లు కథనాలు వస్తున్నాయి..ఇక సెకండ్ ప్లేస్ లో కాంగ్రెస్ ఉన్నట్లు తెలిసింది. అంటే మొత్తం మీద టీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వస్తుందని ఐప్యాక్ సర్వేలో తేలిందని మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే ఈ కథనాల్లో వాస్తవం ఉండొచ్చు…ఉండకపోవచ్చు.

కానీ క్షేత్ర స్థాయిలో గులాబీ పార్టీకి అంత పాజిటివ్ మాత్రం లేదని తెలుస్తోంది…కేసీఆర్ పనితీరు ఎలా ఉన్నా సరే…స్థానికంగా ఉండే ఎమ్మెల్యేల పనితీరు విషయంలో ప్రజలు అసంతృప్తిగానే ఉన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో పలు నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బీజేపీ పోటాపోటిగా పికప్ అవుతున్నాయి. ఇంకా టీఆర్ఎస్ పార్టీకి ఉన్న పెద్ద మైనస్…సొంత పోరు…అంటే టీఆర్ఎస్ పార్టీకి టీఆర్ఎస్ నేతలే శత్రువులు అన్నట్లు పరిస్తితి ఉంది. ఎక్కడకక్కడ నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. చాలా నియోజకవర్గాల్లో ఇదే పరిస్తితి. ఈ పోరు వల్ల టీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ డ్యామేజ్ జరగొచ్చు. ఎన్నికల్లో ఒకరికి సీటు ఇస్తే…మరికొందరు సహకరించే పరిస్తితి లేదు. ఈ అంశమే టీఆర్ఎస్ కొంపముంచే ఛాన్స్ ఉంది.