హుజూరాబాద్ ఉపఎన్నిక షెడ్యూల్ ఎప్పుడు విడుదల అవుతుందో తెలియదు గానీ, ఆ ఉపఎన్నికలో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ మాత్రం తెలంగాణ ప్రజల్లో బాగా ఉంది. ఎందుకంటే ఇంతవరకు టీఆర్ఎస్‌కు టఫ్ ఫైట్ ఎవరూ ఇవ్వలేకపోయారు. కానీ దుబ్బాకలో టీఆర్ఎస్‌ని బీజేపీ ఓడించాక, పరిస్తితులు మారిపోయాయి. పైగా ఇప్పుడు ఈటల రాజేందర్ బరిలో ఉండటంతో ఫలితం ఎలా ఉండబోతుందా? అని ప్రజలు ఎదురుచూస్తున్నారు.
మొన్నటివరకు కేసీఆర్ కుడి భుజం మాదిరిగా నడుచుకున్న ఈటల…ఇప్పుడు అదే కేసీఆర్‌కు పక్కలో బల్లెం మాదిరిగా తయారయ్యారు. ఆయన బీజేపీలో చేరి, టీఆర్ఎస్‌కి పోటీగా నిలబడ్డారు. అయితే ఇలా తమకు ఎదురు నిలబడ్డ ఈటలకు చెక్ పెట్టేయాలని కేసీఆర్ గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. అసలు ఈటలని ఓడించడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారో….కేవలం తెలంగాణ ప్రజలకు మొత్తానికి తెలుసు.
హుజూరాబాద్ ప్రజలని ఆకర్షించడానికి నానా తిప్పలు పడుతున్నారు. అయితే ఇక్కడ కేసీఆర్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నట్లు కనిపిస్తోందని, కేటీఆర్ కూడా అదే తీరులో ఉన్నారని, పైకి ఏమో ఈటల చిన్న మనిషి అని కొట్టిపారేస్తూనే, ఆ చిన్న మనిషిని ఓడించడానికి తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడూలేని విధంగా పెద్ద పథకాలు అమలు చేస్తున్నారని అంటున్నారు.
ఇప్పటికే కేసీఆర్…ఈటలని చిన్న మనిషి అని తీసే పారేశారు. ఇటు కేటీఆర్ సైతం…హుజూరాబాద్ చిన్న ఎన్నిక అని, దాంతో ప్రభుత్వం కూలిపొయేది లేదని, కాబట్టి చిన్న ఉప ఎన్నిక గురించి హైరానా పడాలసిన అవసరం లేదని మాట్లాడారు. అయితే పైకి మాత్రం హుజూరాబాద్ ఉపఎన్నికని పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూనే, లోపల మాత్రం కేసీఆర్, కేటీఆర్‌లు ఈటల గెలుపుని అడ్డుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తారో చెప్పాల్సిన పని లేదని, ఇక ఈ విషయంలోనే హుజూరాబాద్‌లో ఈటల నైతిక విజయం సాధించినట్లే అని అంటున్నారు. పైగా కేటీఆర్ కూడా ఈ ఉపఎన్నికతో ప్రభుత్వం కూలిపోదని మాట్లాడరంటే, ఈ ఉప ఎన్నిక రిజల్ట్ విషయంలో ఆయనకు బాగా క్లారిటీ వచ్చినట్లే కనిపిస్తోందని చెబుతున్నారు.