కేసీఆర్ ‘నేషనల్’ గేమ్..ట్రైలర్లు మాత్రమే..!

మొత్తానికి కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టి..జాతీయ రాజకీయాలో కీలకపాత్ర పోషించడానికి రెడీ అవుతున్నారు. కాకపోతే జాతీయ పార్టీపై ఇప్పటివరకు ట్రైలర్లు మాత్రమే వచ్చాయి..అసలు పార్టీకి సంబంధించిన ఎలాంటి విధివిధానాలు ఖరారు చేశారు…పార్టీ పేరు గాని, ఇతర అంశాలని మాత్రం కేసీఆర్ బయటపెట్టడం లేదు. అలాగే ఖచ్చితంగా జాతీయ పార్టీ పెడతానని చెబుతున్నారు..కానీ ఎప్పుడు ప్రకటిస్తారనేది మాత్రం ఒక ప్రకటన చేయడం లేదు.

అయితే జాతీయ పార్టీ ముహూర్తం కుదిరిందని మీడియాల్లో కథనాలు రావడమే తప్ప..కేసీఆర్ నుంచి అధికారిక ప్రకటన రావడం లేదు. ఆ మధ్యే దసరాకు జాతీయ పార్టీ ప్రకటించేస్తారని కథనాలు వచ్చాయి. తీరా ఇప్పుడు చూస్తే డిసెంబర్‌లో ప్రకటన ఉంటుందని కథనాలు వస్తున్నాయి. మంచి ముహూర్తం చూసుకుని డిసెంబర్‌ నెలలో ప్రకటించే విధంగా కేసీఆర్ కసరత్తు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. ఈలోపు వివిధ రాష్ట్రాల్లో సమావేశాలు నిర్వహించడం, ఆయా రంగాలకు చెందిన మేధావులతో చర్చలు జరిపి, తాను అనుకున్న అంశాలకు తుది మెరుగులు దిద్దడం.. ఇలా నిత్యం జాతీయ పార్టీకి సంబంధించిన విధి విధానాలపైనే కేసీఆర్‌ పనిచేస్తున్నట్లు సమాచారం.

అయితే బీజేపీని ఇరుకున పెట్టేలా కేసీఆర్..జాతీయ పార్టీ రూపకల్పన ఉండబోతుందని తెలుస్తోంది. అలాగే దేశంలోని విపక్ష పార్టీలని ఏకం చేసేలా కేసీఆర్ ఇప్పటికే పనిచేస్తున్నారు. ఇదే సమయంలో బీహార్ సీఎం నితిశ్ సైతం..బీజేపీకి వ్యతిరేకంగా విపక్ష పార్టీలని ఏకం చేస్తున్నారు. అలాగే కేసీఆర్ వేసే ప్రతి స్టెప్ బీజేపీని ఇరుకున పెట్టేలా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పటికే గిరిజన్ల రిజర్వేషన్లు పది శాతానికి పెంచాలని చెప్పి..కేంద్రంపై ఒత్తిడి పెంచారు. లేదంటే రాష్ట్ర ప్రభుత్వమే అమలు చేసుకుంటుందని చెబుతున్నారు.

ప్రస్తుతం జాతీయ పార్టీ రూపకల్పనలో బిజీగా ఉన్న కేసీఆర్..ఇప్పటివరకు పార్టీ గురించి ట్రైలర్లు మాత్రమే వదిలారు. మరి అసలు సినిమా ఎప్పుడు చూస్తారో వెయిట్ చేయాలి. అలాగే అనుకున్న రీతిలో జాతీయ పార్టీ సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.