తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఊహించని ట్విస్ట్‌లు చోటు చేసుకుంటున్నాయి. మొన్నటివరకు రేసులో వెనుకబడిన కాంగ్రెస్..కర్నాటక ఎన్నికల్లో గెలుపుతో ఒక్కసారిగా తెలంగాణలో పుంజుకుంది. బిజేపిని వెనక్కి నెట్టి..బిఆర్‌ఎస్ పార్టీతో ఢీ అంటే ఢీ అనేలా దూసుకొచ్చింది. పైగా ఆ పార్టీకే క్షేత్ర స్థాయిలో బలం ఉంది. దీంతో కాంగ్రెస్ లోకి వలసలు షురూ అయ్యాయి.
భారీ స్థాయిలో వలసలు జరగనున్నాయి. ఇప్పటికే పొంగులేటి, జూపల్లి, దామోదర్ రెడ్డి లాంటి వారు కాంగ్రెస్ వైపు వస్తున్నారు. తాజాగా ఆదిలాబాద్ లో బిఆర్‌ఎస్ కీలక నేతలు శ్రీహరి రావు లాంటి వారు కాంగ్రెస్ లో చేరారు. ఇంకా కాంగ్రెస్ లో చేరేందుకు కీలక నేతలు రెడీగా ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా రేవంత్ రెడ్డి..తన సొంత స్థానం కొడంగల్ లో మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డిని కలిశారు. సీనియర్ నేత అయిన ఈయన్ని కాంగ్రెస్ లోకి తీసుకొస్తున్నారు. అటు మరో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి సైతం సీటు ఇస్తే కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తుంది.
ఇటు తాండూరులో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి సైతం కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారని తెలిసింది. ఈయనకు బిఆర్‌ఎస్ లో సీటు గ్యారెంటీ లేదు. దీంతో ఆయన ఫ్యామిలీతో కలిసి కాంగ్రెస్ లోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఇక ఇటీవలే మరణించిన టిడిపి సీనియర్ నేత కొత్తకోట దయాకర్ రెడ్డి ఫ్యామిలీ సైతం కాంగ్రెస్ లో చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
అలాగే గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచి బిఆర్‌ఎస్ లోకి వెళ్ళిన ఎమ్మెల్యేలు ఉన్నచోట…సీటు ఆశించి భంగపడే బిఆర్‌ఎస్ నేతలు కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోవడం గ్యారెంటీ అని తెలుస్తుంది. ఇలా ఊహించని విధంగా బిఆర్‌ఎస్ లోకి వలసలు జరిగేలా ఉన్నాయి. అలాగే బలమైన నేతలని చేర్చుకుని వారికి సీట్లు ఇవ్వాలని రేవంత్ ప్లాన్ చేసినట్లు సమాచారం. మరి ఈ వలసలు కాంగ్రెస్‌కు ఎంత ప్లస్ అవుతాయో చూడాలి.