పాలమూరు కాంగ్రెస్‌లో రగడ..జూపల్లితో చిచ్చు.!

-

అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల ఎంపిక విషయంలో కాంగ్రెస్ పార్టీ ఆచి తూచి వ్యవహరిస్తుంది. గతంలో మాదిరిగా ఎన్నికల షెడ్యూల్ వచ్చాక హడావిడిగా అభ్యర్ధులని ఎంపిక చేయకుండా..ముందుగానే అభ్యర్ధులని ఖరారు చేసే పనిలో ఉంది. ఈ క్రమంలోనే ఒకో నియోజకవర్గంలో ఇద్దరు, ముగ్గురు నేతలు పోటీ పడుతున్నారు. దీంతో పోటీ చేయాలనుకునే వారు ఓసీ, బి‌సి అభ్యర్ధులు అయితే రూ.50 వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులు అయితే రూ.25 వేలు ఫీజు కట్టి గాంధీభవన్ లో ఎమ్మెల్యే సీటు కోసం దరఖాస్తు చేసుకోవాలని కాంగ్రెస్ కొత్త రూల్ పెట్టింది.

ఇక వచ్చిన దరఖాస్తులని బట్టి..సర్వేల్లో ముందున్న నేతకు అధిష్టానం సీటు ఖరారు చేయనుంది. అయితే సీట్ల కోసం కాంగ్రెస్ లో ఆల్రెడీ లొల్లి మొదలైంది. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో రచ్చ నడుస్తోంది. ఈ క్రమంలోనే పాలమూరులో సీట్ల పంచాయితీ మొదలైంది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఇటీవల పార్టీలో చేరిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో పెద్ద చిక్కులు వచ్చి పడినట్లు తెలుస్తోంది. ఆయన వర్గానికి నాలుగు సీట్లు అడుగుతున్నట్లు సమాచారం.

కొల్లాపూర్ తో పాటు నాగర్‌కర్నూలు, గద్వాల్, వనపర్తి సీట్లు  అడుగుతున్నట్లు తెలిసింది. దీంతో ఆయా సీట్లలో ఉన్న సీనియర్లు మండిపడుతున్నారు. ఈ క్రమంలో నాగర్‌కర్నూలులో ఉన్న నాగం జనార్ధన్ రెడ్డి..జూపల్లిపై ఫైర్ అయ్యారు. నాగర్‌కర్నూలులో తాను కాంగ్రెస్ పార్టీని కాపాడుతున్నానని, కానీ ఇప్పుడు జూపల్లి వచ్చి హడావిడి చేస్తున్నారని మండిపడుతున్నారు.

ఇటు వనపర్తిలో చిన్నారెడ్డి, సీటు ఆశిస్తున్న మరో నేత మధ్య రచ్చ నడుస్తోంది. ఇలా పాలమూరు కాంగ్రెస్ లో సీట్ల పంచాయితీ నడుస్తోంది. అలాగే సీటు కోసం దరఖాస్తులు పెట్టుకోవాలనే నిబంధనలపై కొందరు నేతలు అసంతృప్తిగా ఉన్నారు. సీనియర్లమైన తమకు కూడా ఈ రూల్ ఏంటి అని వాపోతున్నారు. మొత్తానికి ఈ లొల్లి కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసేలా ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version