ఈటల రాజేందర్ పూర్తి టార్గెట్ కేసీఆర్ మాత్రమే…ఆయన్ని అధికారానికి దూరం చేయడమే ఈటల లక్ష్యం. కేవలం కేసీఆర్ ని రాజకీయంగా దెబ్బకొట్టడమే ఈటల పనిగా పెట్టుకున్నారు. ఎప్పుడైతే తనని టీఆర్ఎస్ నుంచి కేసీఆర్ బయటకు వెళ్లిపోయేలా చేశారో..అప్పటినుంచి ఈటల లక్ష్యం ఒక్కటే..కేసీఆర్ ని గద్దె దింపడం. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి…బీజేపీలో చేరి..మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచిన దగ్గర నుంచి ఈటల…కేసీఆర్ లక్ష్యంగానే ముందుకెళుతున్నారు.
అసలు కేసీఆర్ ని ఏ మాత్రం వదలడం లేదు…ఈ మధ్య అయితే మరింత దూకుడుగా కేసీఆర్ పై వెళుతున్నారు. ఊహించని విధంగా వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ పై పోటీ చేస్తానని కూడా ఈటల ప్రకటించేశారు…గజ్వేల్ లో పోటీ చేసి కేసీఆర్ ని ఓడిస్తానని ఈటల చెబుతున్నారు. అలాగే తెలంగాణకు పట్టిన శనిని వదిలించడమే తన లక్ష్యమని మరోసారి కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. అలాగే తాను చేస్తున్న పోరాటానికి హుజూరాబాద్ ప్రజలు మద్ధతు ఉంటుందనే కోణంలో ఈటల చెప్పుకొస్తున్నారు. గజ్వేల్ నుంచి పోటీకి సంబంధించి ఇప్పటికే తాను క్షేత్రస్థాయిలో కార్యాచరణ చేపట్టినట్లు వెల్లడించారు.
అలాగే కేసీఆర్ను ఢీకొట్టాలంటే తమ పార్టీ నేతలు ఈగోలు పక్కనబెట్టాలని, చెట్టుకొమ్మపై ఉన్న పక్షి కన్ను మాత్రమే అర్జునుడికి కనిపించినట్లు, కేసీఆర్ మాత్రమే తమకు లక్ష్యం కావాలని ఈటల అంటున్నారు. అంటే ఈటల పూర్తి స్థాయిలో కేసీఆర్ పైనే ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అయితే కేసీఆర్ పై ఈటల పోటీ గురించి బీజేపీ నేతలు స్పదించడం లేదు…అటు టీఆర్ఎస్ నేతలు కూడా ఏం మాట్లాడటం లేదు. అయితే ఎన్నికలకు సమయం ఉండగానే ఇప్పుడే ఈటల..గజ్వేల్ లో పోటీ చేస్తానని చెప్పడం వెనుక బలమైన కారణాలే ఉంటాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
మొదట ఈటల లాంటి బలమైన నేత పోటీకి దిగితే..కేసీఆర్ ముందు తన గెలుపు గురించి చూసుకోవాలి..ఆయన పూర్తి స్థాయిలో రాష్ట్రంపై ఫోకస్ పెట్టే అవకాశాలు తక్కువ ఉంటాయి…ఎక్కువగా గజ్వేల్ గురించి ఆలోచించాలి…అప్పుడు రాష్ట్రంలో బీజేపీ సత్తా చాటవచ్చు. రెండోది నెక్స్ట్ కేసీఆర్ గజ్వేల్ వదిలేయోచ్చని ప్రచారం జరుగుతుంది… మెదక్ ఎంపీగా గాని, లేదంటే మునుగోడులో పోటీ చేయొచ్చని కథనాలు వస్తున్నాయి. ఒకవేళ నియోజకవర్గం మారిస్తే ఈటల దెబ్బకు కేసీఆర్ గజ్వేల్ వదిలేశారని బీజేపీ చెప్పుకుని రాజకీయ లబ్ది పొందవచ్చు. మొత్తానికైతే కేసీఆర్ పై ఈటల పోటీ చేస్తానని చెప్పడానికి పెద్ద వ్యూహమే ఉన్నట్లు కనబడుతోంది.