కారులో ‘ఈటల’ సెగలు…శ్రావణంలో స్టార్ట్!

-

ఎప్పుడైతే ఈటల రాజేందర్ టీఆర్ఎస్ నుంచి బయటకొచ్చి…బీజేపీలో చేరి…మళ్ళీ హుజూరాబాద్ ఉపఎన్నికలో గెలిచి సత్తా చాటారో అప్పటినుంచి టీఆర్ఎస్ నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని చెప్పొచ్చు. ఒకవేళ ఆయన ఉపఎన్నిక బరిలో ఓడిపోయి ఉంటే పరిస్తితి వేరేగా ఉండేది ఏమో గాని..ఆయన గెలవడం టీఆర్ఎస్ పార్టీకి పెద్ద డ్యామేజ్. అలాగే బీజేపీకి కొత్త ఊపు వచ్చింది.

అయితే కావాలని పార్టీ నుంచి బయటకెళ్లిపోయేలా చేసిన కేసీఆర్ ని మాత్రం ఈటల వదిలిపెట్టే ప్రసక్తే లేదని అంటున్నారు. కేసీఆర్ పతనం చూసేవరకు నిద్రపోయేలా ఉన్నారు. ఎలాగైనా నెక్స్ట్ కేసీఆర్ ని గద్దె దించడమే లక్ష్యంగా పెట్టుకుని ఈటల పనిచేస్తున్నారు. గతం కంటే భిన్నంగా ఈటల రాజకీయం ఉంది. గతంలో ఈటల చాలా సాఫ్ట్ గా రాజకీయం చేసేవారు…కానీ సాఫ్ట్ గా ఉండే ఈటలని మార్చింది కేసీఆర్ రాజకీయమే. ఆ రాజకీయంతోనే కేసీఆర్ కు చెక్ పెట్టాలని ఈటల చూస్తున్నారు.

ఈ మధ్య మరింత దూకుడుతో ముందుకెళుతున్నారు…పైగా వచ్చే ఎన్నికల్లో గజ్వేల్ లో పోటీ చేస్తానని, కేసీఆర్ ని ఓడిస్తానని అంటున్నారు..పదే పదే ఈటల గజ్వేల్ లో పోటీ గురించి మాట్లాడుతున్నారు…అలాగే హుజూరాబాద్ లో తన భార్య జమునా రెడ్డిని బరిలో దింపే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇక చేరికల కమిటీ కన్వీనర్ అయ్యాక ఈటల….టీఆర్ఎస్ లో ఉండే బడా నేతలని బీజేపీలోకి లాగే ప్రయత్నాలు మొదలుపెట్టారు.

మామూలుగానే టీఆర్ఎస్ లోని అందరూ నేతలతో ఈటలకు మంచి పరిచయాలు ఉన్నాయి…పాత పరిచయాలని ఉపయోగించుకుని, కారు నేతలని లాగడానికి ఈటల దూకుడుగా వెళుతున్నారు. అయితే ఇప్పటికే ఈటలతో పలువురు నేతలు టచ్ లోకి వచ్చారని తెలుస్తోంది. వారు బీజేపీలో చేరడానికి రెడీ అయ్యారని సమాచారం.

కాకపోతే ఇప్పుడు ఆషాడ మాసం నడుస్తోంది…శ్రావణంలో పార్టీ చేరికలకు ముహూర్తం ఫిక్స్ చేసినట్లు ఈటల చెబుతున్నారు. ఈ నెల 27 తర్వాత అంటే..శ్రావణ మాసంలో బీజేపీలోకి వలసలు మొదలవ్వనున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా బీజేపీలోకి రావడానికి రెడీ అయ్యారని తెలుస్తోంది. అయితే టీఆర్ఎస్ నుంచి ఎవరు వెళ్లిపోతారా? అని అంతా ఎదురుచూస్తున్నారు. మొత్తానికైతే కారు పార్టీలో ఈటల సెగలు పుట్టిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news