ఇటు ఈటల..అటు అరుణ…సైలెంట్‌గా సెట్ చేస్తున్నారుగా!

నెక్స్ట్ ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతున్న విషయం తెలిసిందే. ఎలాగైనా కేసీఆర్‌ని గద్దె దించి….తెలంగాణలో కాషాయ జెండా ఎగరవేయాలని చూస్తున్నారు. ఇప్పటికే ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ దూకుడుగా రాజకీయం చేస్తున్న విషయం తెలిసిందే. కేసీఆర్‌తో నువ్వా-నేనా అన్నట్లు తలపడుతున్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు. బీజేపీని బలోపేతం చేసే కార్యక్రమాలు చేస్తున్నారు.

etela
etela

అయితే బండి ఎంత పోరాడినా..బీజేపీలో పూర్తి స్థాయిలో బలమైన నాయకులు లేరనే చెప్పాలి. ఏదో కొన్ని నియోజకవర్గాల్లో మాత్రమే బీజేపీకి బలమైన నాయకులు ఉన్నారు. మిగిలిన నియోజకవర్గాల్లో పార్టీకి సరిగ్గా నేతలు లేరు. ఈ పరిస్తితి ఇలాగే ఉంటే వచ్చే ఎన్నికల్లో ఈ బలంతో టీఆర్ఎస్‌ని ఓడించడం కష్టం. అందుకే ఇక్కడ నుంచి బీజేపీలోకి బలమైన నాయకులని తీసుకోవడమే లక్ష్యంగా ఈటల రాజేందర్, డీకే అరుణలు పనిచేయనున్నారని తెలుస్తోంది.

హుజూరాబాద్ ఉపఎన్నికలో గెలిచాక బీజేపీకి ఈటల ఒక పవర్ సెంటర్‌గా తయారైన విషయం తెలిసిందే. ఆయన ద్వారా పార్టీని బలోపేతం చేయాలని బీజేపీ పెద్దలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఎలాగో ఈటలకు…టీఆర్ఎస్ నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నయి. ఇక వారిలో ఎవరైతే టీఆర్ఎస్‌పై అసంతృప్తిగా ఉన్నారో వారిని బీజేపీలోకి తీసుకురావడానికి ఈటల ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే పలువురు నేతలు ఈటలకు టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే వారు బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇక టీఆర్ఎస్‌ని దెబ్బకొట్టే పని ఈటల చూసుకుంటుంటే…కాంగ్రెస్‌ని వీక్ చేసే పని డీకే అరుణ తీసుకున్నారు.

దశాబ్దాల పాటు అరుణ కాంగ్రెస్‌లో పనిచేసిన విషయం తెలిసిందే. ఆ పార్టీ వీక్ అయిపోవడంతో ఆమె బీజేపీలో చేరిపోయారు. అయితే నెక్స్ట్ ఎన్నికల్లో బీజేపీ గెలవాలంటే కాంగ్రెస్ ఇంకా వీక్ అవ్వాలి. అందుకే అరుణ సైతం కొందరు కాంగ్రెస్ నేతలని బీజేపీలో తీసుకొచ్చే ప్రయత్నాలు మొదలుపెట్టారట. గతంలో తనతో సన్నిహితంగా ఉన్న నాయకులని బీజేపీలోకి లాగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మొత్తానికైతే ఇద్దరు నేతలు సైలెంట్‌గా సెట్ చేసేస్తున్నారు.