తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ నాయకులు అర్ధంలేని ఆరోపణలు చేస్తున్నారని తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ మందిపడ్డారు. వర్చువల్ ర్యాలీలో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేసీ నడ్డా వ్యాఖ్యలను ఈటల ఖండించారు. ఆదివారం నాడు మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. బీజేపీ నేతలు చిల్లర మల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. జేసీ నడ్డా బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని, మాట్లాడేముందు కొంచం ఆలోచించాలని ఆయన తెలియజేశారు. గుజరాత్ లో కరోనా తీవ్రతపై ప్రధాని బాధ్యత వహిస్తారా అని ఆయన ప్రశ్నించారు.
కరోనా కట్టడి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు శ్రమిస్తున్నారని ఆయన గుర్తు చేశారు. కరోనా అనేది ప్రపంచ సమస్యగా ఆయన చెప్పారు. దేశానికి కంటైన్మెంట్ ను పరిచయం చేసిందే తెలంగాణ ప్రభుత్వం అని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఢిల్లీలో మర్కజ్ వ్యవహరాన్ని కేంద్ర ప్రభుత్వంతో పాటు ఢిల్లీ ప్రభుత్వానికి తెలిపింది కూడ తామేనని ఆయన ప్రస్తావించారు. లాక్ డౌన్ ను పకడ్బందీగా అమలు చేసినట్టుగా ఆయన చెప్పారు. కరోనా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన విధానాలను పలు సంస్థలు ప్రశంసించాయన్నారు. ఎప్పటికప్పుడు ప్రజలకి అవగాహన కల్పిస్తూ సీఎం ఆదేశాలతో అధికారులు నిరతరం పనిచేస్తున్నారని తెలిపారు.