టీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులెవరూ కూడా ఉండబోరని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన హుజూరాబాద్ ఎన్నికల సన్నాహక సమావేశంలో బండి సంజయ్ పాల్గొన్నారు. బీజేపీలో చేరిన తర్వాత తొలిసారి పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు బండి సంజయ్ ఆత్మీయ స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ… హుజూరాబాద్ లో వార్ వన్ సైడేనని.. అక్కడ కాషాయ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.కోట్లు ఖర్చు పెట్టినా టీఆర్ఎస్ కు డిపాజిట్ దక్కదని అన్నారు.ఈటల రాజేందర్ లాంటి చాలా మంది ఉద్యమకారులు బీజేపీలో చేరారని ఇకపై టీఆర్ఎస్‌లో ఉద్యమకారులెవరూ ఉండబోరని అన్నారు. నేడు బీజేపీలో ఒక పండగ వాతావరణం నెలకొందని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఈటల రాజేందర్ ప్రధాన భూమిక పోషించిన వ్యక్తి అని, అనేక, కష్టాలు, సమస్యలను ఎదుర్కొని తెలంగాణ సమాజం కోసం ఈటల ఉద్యమించారని గుర్తు చేసారు. ఒక ఆశయం, తపన, నిర్దేశిత లక్ష్యం కోసం ఈటల రాజేందర్ గారు పోరాటం చేశారని అన్నారు. అమరవీరుల ఆశయాలకు భిన్నంగా రాష్ట్రంలో రాక్షసపాలన సాగుతోందని, రాష్ట్రంలో ఒక గడీల పాలన, అవినీతి, అరాచక, కుటుంబపాలన నడుస్తోందని మండిపడ్డారు. కేసీఆర్ అరాచక పాలనను ప్రశ్నించినందుకు ఈటల రాజేందర్ ను ఇబ్బంది పెట్టారని అన్నారు. ఇక ప్రతిపక్ష హోదా కూడా లేని కాంగ్రెస్, దేశంలో రెండు సీట్లు కూడా లేని వామపక్ష పార్టీ బీజేపీ గురించి మాట్లాడటం సిగ్గుచేటని ఫైర్ అయ్యారు. దేశంలో భూతద్దం పెట్టి వెతికినా కనిపించని పార్టీ కాంగ్రెస్సే అని ఎద్దేవా చేసారు.