హుజురాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ తరఫున నిలబడబోయే అభ్యర్థిని అధికార పార్టీ ఎట్టకేలకు ప్రకటించింది. పింక్ పార్టీ ట్రబుల్ షూటర్, మంత్రి హరీశ్‌రావు అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ( Gellu Srinivas Yadav )ను నియోజకవర్గ ప్రజలకు పరిచయం చేసేందుకుగాను ‘ప్రజా ఆశీర్వాద సభ’ను నిర్వహించారు. మొత్తంగా అధికార పార్టీ ప్రచార పర్వంలో ముందుకు వెళ్లేందుకుగాను సీరియస్‌గానే ట్రై చేస్తోంది.
ఇక ఈ నెల 16న సీఎం కేసీఆర్ ‘దళిత బంధు’ స్కీమ్‌ను పైలట్ ప్రాజెక్టు కింద నియోజకవర్గంలో ప్రారంభించనున్నారు. ఇకపోతే నియోజకవర్గంలోని వీణవంక మండలం హిమ్మత్ నగర్ కుచెందిన గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు విద్యార్థి నేతగా గుర్తింపు ఉంది. టీఆర్ఎస్‌వీ రాష్ట్ర అధ్యక్షులుగా ప్రస్తుతం ఆయన ఉన్నారు. ఈ క్రమంలోనే బీజేపీ తరఫున బరిలో ఉన్న మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు ప్రత్యర్థిగా నిలవబోతున్నారు. అయితే, గతంలో గెల్లు శ్రీనివాస్ యాదవ్ తండ్రి గెల్లు మల్లయ్య యాదవ్ కూడా ఈటలకు ప్రత్యర్థిగా ఉన్నారు.
2004లో ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీ తరఫున కమలాపూర్ నుంచి పోటీ చేయగా, ఆయనకు ప్రత్యర్థిగా నాడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఫాదర్ మల్లయ్య ఉన్నారు. అయితే, ఆనాటి రాజకీయ పరిస్థితులతో మల్లయ్య తర్వాత ఈటలకు మద్దతు పలికి పోటీ నుంచి తప్పుకున్నారు. కాగా తాజాగా హుజురాబాద్‌లో జరగనున్న బై పోల్‌లో బలమైన ప్రత్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఉండబోతున్నారు. ఈ క్రమంలోనే నాడు తండ్రి నేడు తనయుడు ఈటల రాజేందర్‌కు ప్రత్యర్థిగా ఉన్నారంటూ నియోజకవర్గ ప్రజలు, వీణవంక మండల పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
అయితే, హుజురాబాద్‌లో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ అనే సీన్ ఉంటుందని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడబోయే అభ్యర్థి ఎవరు? అనేది ఇంకా తేలలేదు. టీపీసీసీ చీఫ్ రేవంత్ మదిలో ఎవరు ఉన్నారు? ఎవరిని బరిలో నిలపబోతున్నారు? అనేది తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేంత వరకు వెయిట్ చేసి చూడాల్సిందే.