హుజూరాబాద్‌లో మాజీ మంత్రి ఈటల రాజేందర్(etela rajendar)ని ఓడించడమే లక్ష్యంగా అధికార టీఆర్ఎస్ అదిరిపోయే వ్యూహాలతో ముందుకెళుతుంది. తమ అధికార, రాజకీయ బలాన్ని అంతా ఉపయోగించి హుజూరాబాద్‌లో గులాబీ జెండా ఎగరవేయాలని చూస్తున్నారు. అందుకే ఈటలని ఓడించడానికి ఎన్ని దారులు ఉంటే, అన్నీ దారుల్లో టీఆర్ఎస్ వెళుతుంది.

ఇప్పటికే హుజూరాబాద్ ప్రజలని ఆకట్టుకోవడమే లక్ష్యంగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు. అటు హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ గెలుపుని హరీష్ రావు తన భుజాన వేసుకున్నారు. అన్నీ తానై హుజూరాబాద్‌లో కారు స్పీడ్ పెంచడానికి చూస్తున్నారు. ఓ వైపు టీఆర్ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ని అంటిపెట్టుకుని మరీ హరీష్ నియోజకవర్గంలో తిరిగేస్తున్నారు. మరోవైపు సీఎం కేసీఆర్ సైతం దళితబంధు పథకంతో హుజూరాబాద్‌లోని ప్రజల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఇక రాజకీయంగా ఈటలని అన్నీ రకాలుగా దెబ్బకొడుతూ ముందుకెళుతున్నారు. హుజూరాబాద్‌లో గెలవడానికి బలమైన నాయకులని తమవైపుకు తిప్పుకుంటున్నారు. అదేవిధంగా ఈటలకు మద్ధతుగా ఉండే బలమైన నాయకులని సైతం హరీష్, టీఆర్ఎస్‌లోకి తీసుకొస్తున్నారు. ఇప్పటికే పలువురు ఈటల అనుచరులని పార్టీలోకి తీసుకున్నారు. తాజాగా ఈటలకు ప్రధాన అనుచరుగా ఉన్న పోచమల్లు సైతం గులాబీ గూటికి చేరుకున్నారు. ఈ విధంగా అన్నీ వైపులా నుంచి ఈటలని దెబ్బకొట్టడమే లక్ష్యంగా గులాబీ దళం ముందుకెళుతుంది.
అయితే ఈటల మాత్రం తన సొంత బలాన్ని, హుజూరాబాద్ ప్రజలపై ఆశలు పెట్టుకుని ముందుకెళుతున్నారు. ఈయనకు బీజేపీ నుంచి కూడా పెద్దగా సహకారం అందేలా కనిపించడం లేదు. అయినా సరే ఈటల గట్టిగానే టీఆర్ఎస్‌పై పోరాడుతున్నారు. మరి ఈ పోరాటంతో ఈటల, టీఆర్ఎస్‌కు చెక్ పెట్టగలరో లేక…గులాబీ పార్టీ దెబ్బకు ఈటల చేతులెత్తేస్తారో చూడాలి.