పోటాపోటి: హుజూరాబాద్‌లో వేగంగా మారుతున్న రాజకీయ సమీకరణాలు…

-

ఊహించని విధంగా హుజూరాబాద్‌ huzurabad లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇక్కడ మాజీ మంత్రి ఈటల రాజేందర్, టీఆర్ఎస్‌ల మధ్య గట్టి పోటీ నడుస్తోంది. ఈటల బీజేపీలో చేరినా కూడా, హుజూరాబాద్‌లో బీజేపీకి సొంతంగా గట్టి బలం లేదు. దీంతో ఈటల తన సొంత బలంతోనే టీఆర్ఎస్‌ని మట్టికరిపించడానికి సిద్ధమవుతున్నారు. అటు ఈటలకు చెక్ పెట్టడానికి అధికార టీఆర్ఎస్ సరికొత్త ఎత్తుగడలతో ముందుకెళుతుంది.

అయితే ఇక్కడ కాంగ్రెస్ కూడా ఇన్‌చార్జ్‌ని పెట్టుకుని దూకుడుగా రాజకీయం చేస్తుంది. ఇలా ప్రధాన పార్టీల వ్యూహాలతో హుజూరాబాద్‌లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. ఈ క్రమంలోనే హుజూరాబాద్ ప్రజలకు మరింత దగ్గరవ్వడమే లక్ష్యంగా ఈటల, నియోజకవర్గంలోని అన్నీ ఊర్లని కలుపుకుంటూ పాదయాత్ర మొదలుపెట్టారు. నియోజకవర్గంలో ప్రతి గ్రామాన్ని టచ్ వేసే విధంగా ఈటల పాదయాత్ర మ్యాప్ సిద్ధం చేసుకున్నారు. ఇలా పాదయాత్ర చేస్తే ప్రజలకు మరింత దగ్గరయ్యి సత్తా చాటవచ్చని ఈటల భావిస్తున్నారు.

ఈటలకు పోటీగా టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకెళుతుంది. ఇప్పటికే మండలానికో మంత్రిని ఇన్‌చార్జ్‌గా పెట్టారు. ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో హుజూరాబాద్‌లో మకాం వేసి టీఆర్ఎస్ గెలుపు కోసం కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే విద్యార్ధులతో నియోజకవర్గంలో అన్నీ గ్రామాలు పర్యటించేలా  టీఆర్ఎస్ బస్సు యాత్ర చేపట్టనుంది. ఇదే గాకుండా మంత్రి కేటీఆర్ సరికొత్త వ్యూహంతో హుజూరాబాద్‌లో రాజకీయం చేస్తున్నారు.

నియోజకవర్గంలో టీఆర్ఎస్ సభ్యత్వం ప్రతి ఒక్కరినీ కలవడమే లక్ష్యంగా వ్యూహం రచించారు. ఆ బాధ్యత పల్లా రాజేశ్వర్ రెడ్డికి అప్పగించారు. అంటే ప్రతి సభ్యుడుని కలిసి, టీఆర్ఎస్‌ని గెలిపించాలని పల్లా కోరనున్నారు. ఈ విధంగా హుజూరాబాద్‌లో ఈటల-టీఆర్ఎస్‌ల మధ్య పోరు నడుస్తోంది. మరి ఉపఎన్నికలో ఎవరి వ్యూహం వర్కౌట్ అవుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news