వీరయ్యకు బీఆర్ఎస్ బంపర్ ఆఫర్..?

-

ఇటీవల కాలంలో తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే పోదెం వీరయ్య వ్యవహారం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈయన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌తో భేటీ కావడం సంచలనంగా మారింది. వీరయ్య సైతం కారు ఎక్కడానికి రెడీ అయ్యారని కథనాలు వస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో చేరిన విషయం తెలిసిందే. ఆ మధ్య కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే.

దీంతో ప్రస్తుతానికి కాంగ్రెస్ లో ఐదుగురు ఎమ్మెల్యేలు మిగిలారు. భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, సీతక్క, జగ్గారెడ్డి, పోదెం వీరయ్య. అయితే ఇప్పుడు వీరయ్య సైతం పార్టీ మారతారని తెలుస్తోంది. ఎర్రబెల్లితో భేటీ అవ్వడంతో జంపింగ్ ఖాయమని అంటున్నారు. అయితే వీరయ్య మాత్రం భద్రాచలం పట్టణాన్ని మూడు గ్రామ పంచాయితీలుగా విభజిస్తూ ఈ నెల 16న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిని రద్దు చేసి భద్రాచలంను మేజర్‌ గ్రామపంచాయతీగా గుర్తించి వెంటనే ఎన్నికలు జరపాలని మంత్రి దయాకర్‌రావును కోరడానికి కలిశానని చెబుతున్నారు. అటు మంత్రి ఎర్రబెల్లి సైతం..వీరయ్య అందుకే కలిశారని అంటున్నారు.

‘గులాబీ’ వలలో వీరయ్య!

కానీ అంతర్గతంగా పార్టీ మార్పుపై చర్చలు జరిగాయని కథనాలు వస్తున్నాయి. ఇదే క్రమంలో వీరయ్య కొన్ని డిమాండ్లు పెట్టినట్లు సమాచారం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ములుగు టికెట్‌తో పాటు వచ్చే ప్రభుత్వంలో తనకు మంత్రి పదవిపై హామీ ఇవ్వాలని పోదెం కోరినట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో రెండుసార్లు ములుగు నుంచి, ప్రస్తుతం భద్రాచలం నుంచి మొత్తం మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికైన వీరయ్యకు వచ్చే ప్రభుత్వంలో అధిష్ఠానం సముచిత స్థానం కల్పిస్తుందని ఎర్రబెల్లి చెప్పినట్లు సమాచారం.

దీంతోపాటు భద్రాచలం నుంచి తాను సూచించిన వ్యక్తికి టికెట్‌ ఇవ్వాలనే కండిషన్‌ కూడా వీరయ్య పెట్టినట్లు చెప్పుకొంటున్నారు. అయితే వీరయ్య డిమాండ్లని కేసీఆర్‌కు చెబుతానని ఎర్రబెల్లి చెప్పినట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్లుగానే జరిగితే కొత్త ఏడాదిలో వీరయ్య కారు ఎక్కుతారని తెలుస్తోంది. అయితే ఆదివాసీల ఓట్లతో పాటు సీతక్కకు చెక్ పెట్టడానికే వీరయ్యని బీఆర్ఎస్‌లోకి తీసుకొస్తున్నారని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news