ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ సాధ్య‌మేనా.. నిపుణులు ఏం చెబుతున్నారు

-

ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌కు అనుకూలంగా సుప్రీమ్‌కోర్టు తీర్పునిచ్చింది. దీనిపై మాదిగ‌లు హ‌ర్షం వ్య‌క్తం చేసి సంబ‌రాలు కూడా చేసుకున్నారు. వ‌ర్గీక‌ర‌ణ‌కు స‌పోర్ట్ చేసిన నేత‌ల‌కు మాదిగ సంఘాల నాయ‌కులు కృత‌జ్ఞ‌త‌లు కూడా తెలిపారు.ఇదంతా బాగానే ఉంది.., కానీ అస‌లు ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ సాధ్య‌మేనా అనే అనుమానాలు ఇప్పుడు తెర‌మీద‌కు వ‌స్తున్నాయి.వ‌ర్గీక‌ర‌ణ‌పై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం హ‌ర్షం వ్య‌క్త‌ప‌రిచారు. ఎస్సీ వర్గీకరణను తెలంగాణలోనే మొదట‌ అమలయ్యేలా చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీ వేదికగా ప్రకటించారు.

ఇక ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు తాను ఎస్సీవర్గీకరణ అవసరాన్ని 20 ఏళ్ల క్రితమే గుర్తించానని తెలిపారు. ఇక అన్నీ రాజకీయ పార్టీలు సైతం సుప్రీం తీర్పును స్వాగతించాయి. అయితే వ‌ర్గీక‌ర‌ణ ఎలా చేప‌డ‌తారు…దీనిని అమ‌ల్లోకి ఎప్పటి నుంచి తీసుకువ‌స్తారు.. అస‌లు వ‌ర్గీక‌ర‌ణ అనేది సాధ్య‌మ‌య్యే అంశ‌మేనా అనే ప్ర‌శ్న‌లు వినిపిస్తున్నాయి. రిజ‌ర్వేష‌న్‌ల వర్గీక‌ర‌ణ అంత ఈజీ కాదు అని ముప్ప‌య్యేళ్ళ‌పాటు పోరాటం చేసిన మంద కృష్ణ మాదిగ చెప్తున్న నేప‌థ్యంలో పాల‌కులు దీనిని ఎలా కొలిక్కి తెస్తార‌నేది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

ప్ర‌భుత్వ‌రంగం కంటే ప్రైవేటు రంగంపైనే అంద‌రూ దృష్టి సారిస్తున్న ప‌రిస్థితులు చూస్తున్నాం. అందుకు త‌గిన‌ట్లుగానే ప్రభుత్వ ఉద్యోగాలు కూడా తగ్గిపోతున్నాయి. ల‌క్ష‌ల్లో ఖాళీలు ఉన్నా వాటిని భ‌ర్తీ చేసేందుకు ప్ర‌భుత్వాలు ముందుకు రావ‌డంలేదు. వేగంగా విస్త‌రిస్తున్న ప్రైవేటు రంగంవైసే అంద‌రూ వెళుతున్నారు. దీనికి అనుగుణంగా ప్రైవేటు రంగంలోనే రిజ‌ర్వేష‌న్‌లు అమ‌లు చేసేందుకు ప్ర‌భుత్వాలు చ‌ర్య‌లు తీసుకుంటున్నాయి.

కొన్ని రాష్ట్రాల్లో దీనిపై చ‌ట్టం కూడా చేసి అమ‌ల్లోకి తీసుకువ‌చ్చాయి. అలా చ‌ట్టం చేసిన వాటిల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ర్ఠం కూడా ఉంది. పెట్ట‌బ‌డులు త‌గ్గిపోవ‌డానికి ఇది కూడా ఒక కార‌ణ‌మ‌నే వాద‌న ప్ర‌చారంలో ఉంది. అటు కోర్టులు కూడా ప్రైవేటు రిజ‌ర్వేష‌న్‌ల బిల్లును వ్య‌తిరేకించాయి. అటు ప్రైవేటు రంగంలో కూడా వ‌ర్గీక‌ర‌ణ రిజ‌ర్వేష‌న్‌లు అమ‌లు చేయాల‌ని కుల సంఘాల నాయ‌కులు డిమాండ్ చేస్తున్నా అది సాధ్య‌మ‌య్యే విష‌యం కాదు. అంద‌రికీ ఇది పెద్ద స‌మ‌స్య‌గా ప‌రిణ‌మించే అవ‌కాశం ఉంది. ఇదిలా ఉంటే సుప్రీంకోర్టు తీర్పును స‌వాల్ చేస్తూ మాల‌లు ఉద్యమాల‌కు సిద్ధం కావ‌డంతో రాజ‌కీయ పార్టీలు సందిగ్ధంలో ప‌డుతున్నాయి.

ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కాంగ్రెస్ మాజీఎంపీ హ‌ర్ష‌కుమార్ తీవ్రంగా వ్య‌తిరేకించారు. ఆర్టిక‌ల్ 351 ప్ర‌కారం చూస్తే వ‌ర్గీక‌ర‌ణ చేసే హ‌క్కు పార్ల‌మెంట్‌కు లేద‌న్నారు. అలాంట‌ప్పుడు వ‌ర్గీక‌ర‌ణ‌కు అనుకూలంగా తీర్పు ఎలా ఇస్తార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. సుప్రీంతీర్పు మాల‌ల అస‌లు ఆమోదించ‌డం లేద‌ని కుండ‌బ‌ద్ధ‌లు కొట్టారు. తెలంగాణ‌లో మాదిగ సామాజిక‌వ‌ర్గం ఎక్కువ‌గా ఉండ‌టం చేత ఒక‌ప్పుడు అక్క‌డ రిజ‌ర్వేష‌న్‌లు అమ‌లు సాధ్యంగా క‌నిపించింది. ఆ దిశ‌గా చంద్ర‌బాబునాయుడు అమ‌లు చేసి మాదిగ‌ల‌ను సంతృప్తి ప‌రిచారు.

ఏపీలో వ‌ర్గీక‌ర‌ణ అమ‌లు అంత సుల‌భ‌మ‌య్యే ప‌రిస్థితులు లేవు. అమలుకు ప్రయత్నిస్తే మాలల నుంచి తీవ్ర వ్యతిరేకత తప్పదు. ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి. మరోవైపు వర్గీకరణపై వ్యతిరేకత పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు ఎలా అమలు చేస్తాయన్నది అస‌లు ప్ర‌శ్న‌. రిజ‌న‌ర్వేష‌న్‌ల‌ను అమ‌లు చేస్తామ‌ని ప్ర‌భుత్వాలు బ‌హాటంగా ప్ర‌క‌టించినా అంత‌ర్గ‌తంగా దానిని పార్టీలోనే నేత‌లే వ్య‌తిరేకించ‌డంలో రాజ‌కీయ పార్టీల‌కు ఇది త‌ల‌నొప్పి స‌మ‌స్య‌గా మారింది. ఇదిలా ఉంటే ప్రైవేటు రంగంలోనూ రిజ‌ర్వేష‌న్‌ల కోసం పోరాటాలు చేస్తామ‌ని మందా కీష్ణ మాదిగ మ‌రోసారి ప్ర‌క‌టించ‌డంతో తెలుగు రాష్ర్టాల్లో రాజ‌కీయాలు ఆస‌క్తిక‌రంగా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version