వైసీపీ అధికారంలోకి వచ్చాక రాజధాని అమరావతి మరుగున పడిన విషయం తెలిసిందే. అమరావతికి వేల కోట్లు ఖర్చు పెట్టే కంటే..అభివృద్ధి చెందిన విశాఖని రాజధానిగా చేస్తామని జగన్ ప్రకటించారు. అలాగే అమరావతిని శాసన రాజధానిగా ఉంచుతామని, కర్నూలుని న్యాయ రాజధాని చేస్తామని చెప్పారు. జగన్ ఎప్పుడైతే చెప్పారో..అప్పటినుంచి అమరావతిలో ప్రజలు, రైతులు పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. భూములు ఇచ్చిన తమకు న్యాయం చేయాలని ఉద్యమం చేస్తున్నారు.
దీంతో అమరావతి ప్రాంత పరిధిలో వైసీపీపై ఫుల్ యాంటీ కనిపించింది. ఇక జగన్ సైతం అమరావతిని సైతం పెద్దగా పట్టించుకోలేదు. కానీ రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా ముందుకెళుతున్న జగన్..అమరావతిలో కూడా వైసీపీ జెండా ఎగరవేయాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఊహించని స్కెచ్ తో అమరావతిలో రాజకీయం మొదలుపెట్టారు. అమరావతి ప్రాంత పరిధిలో ఇతర ప్రాంతాలకు చెందిన వారికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేపట్టారు. మొదట దీనిపై అమరావతి రైతులు పోరాటం చేశారు. ఇతర ప్రాంతాల వారికి ఇక్కడ స్థలాలు ఇవ్వడం ఏంటని కోర్టు మెట్లు ఎక్కారు.
తాము రాజధానికి భూములు ఇచ్చామని, కాబట్టి ఇక్కడ ప్రాంత ప్రజలకే ఇక్కడ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కానీ కోర్టులో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో అమరావతి పరిధిలో దాదాపు 50 వేల ఇళ్ల పట్టాలని జగన్ పంపిణీ చేయడానికి శ్రీకారం చుట్టారు. ఈ నెల 26న అమరావతిలో భారీ సభ పెట్టి ఇళ్ల స్థలాలు పంపిణీ చేయనున్నారు.
మంగళగిరి, తాడికొండ పరిధిలోనే ఇళ్ల స్థలాల పంపిణీ జరగనుంది. ఇక 50 వేల మందికి ఇళ్ల పట్టాలు అంటే..కొత్తగా అక్కడ ఎన్ని ఓట్లు నమోదు అవుతాయో అర్ధం చేసుకోవచ్చు. కొత్తగా వచ్చిన వారు వైసీపీకే మద్ధతు తెలుపుతారని జగన్ భావిస్తున్నారు. అప్పుడు అమరావతిలో కూడా పైచేయి సాధించవచ్చు అనేది జగన్ మార్క్ రాజకీయం.