తెలంగాణలో బిఆర్ఎస్ హ్యాట్రిక్ కోసం ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. ఇంకా బీజేపీ, కాంగ్రెస్ తమ అభ్యర్థులు ఎవరో ప్రకటించలేదు. ఎన్నికల షెడ్యూల్ రావడంతో అభ్యర్ధుల ఎంపికపై గురి పెట్టాయి. అయితే ఈ సారి దక్కించుకోవడం కోసం ప్రతి పార్టీ తమ వ్యూహాలని అమలు చేస్తుంది. ముఖ్యంగా కులాల వారీగా వ్యూహాలు అమలు చేస్తూ..మెజారిటీ ఓట్లు దక్కించుకోవాలని చూస్తున్నాయి.
ఇప్పటికే పలు కుల సంఘాలు వరుసగా మీటింగులు పెడుతూ..తమకు ప్రాధాన్యత ఇచ్చినవారికే తమ మద్ధతు అని చెబుతున్నారు. ఇదే సమయంలో కమ్మ సామాజిక వర్గం వారు కూడా రాజకీయం గా తమ సత్తా చాటాలి అని అంటున్నారు. కమ్మ సామాజిక వర్గం వారు తమకు కొన్ని స్థానాలు కావాలని అడుగుతున్నారు. బిఆర్ఎస్ అభ్యర్థుల జాబితా ప్రకటించింది కాబట్టి, బిఆర్ఎస్ జోలికి వెళ్లకుండా కాంగ్రెస్, బిజెపి పెద్దలను కలుస్తున్నారు. ఉన్నది ఐదు శాతం ఓట్లే అయినా 30 నియోజకవర్గాల్లో తమ ప్రభావం ఉంటుందంటూ కమ్మ సామాజిక వర్గ నేతలు ఢిల్లీ వరకు వెళ్లారు. బిజెపి టికెట్ల కోసం కిషన్ రెడ్డికి ఒక లేఖ ఇచ్చి ఊరుకున్నారు.
కానీ కాంగ్రెస్ లో పట్టు సాధించాలనుకున్నారో ఏమో ఢిల్లీ వరకు వెళ్లి సీనియర్ నేతలను కలిసి తమకు కచ్చితంగా 12 స్థానాలు ఇవ్వవలసిందేనని అడుగుతున్నారు. ఈసారి కాంగ్రెస్ తమ సామాజిక వర్గానికి సీట్లిస్తే కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చుకుంటామని కమ్మ నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్ లో ఒక వర్గం ఇదంతా రేవంత్ రెడ్డి రాజకీయం అంటూ విమర్శిస్తున్నా, కమ్మ సామాజిక వర్గం వారు మాత్రం ఈసారి తమకు తగిన స్థానాలు ఇచ్చిన పార్టీకే మద్దతు ఉంటుందని చెబుతున్నారు.
చంద్రబాబు అరెస్ట్ తెలంగాణలో ప్రభావం చూపిందని తెలుస్తోంది. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఐటీ ఉద్యోగుల ర్యాలీపై పోలీస్ ఆంక్షలు, కేసులు పెట్టడం, పార్టీలో నాయకులెవరు తమ సామాజిక వర్గ నేతలు మద్దతు తెలుపకపోవడం ఇవన్నీ కమ్మ సామాజిక వర్గం వారికి బాధను కలిగించి, ఇప్పుడు తెలంగాణలో తమ ప్రభావాన్ని పెంచుకోవడానికి కాంగ్రెస్ లో సీట్లు అడుగుతున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ తరఫున కమ్మ సామాజిక వర్గం వారు అడుగుతున్నది 12 సీట్లే అయినా అవన్నీ గట్టి పోటీ ఉన్న నియోజకవర్గాలే. బాన్సువాడలో కాసుల బాలరాజు పోటీగా ఉన్నారు. కూకట్ పల్లి లో శ్రీరంగం సత్యం, శేరిలింగంపల్లి నుంచి 14 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, మేడ్చల్లో కూడా ఆశావహులు చాలామంది ఉన్నారు. అటు ఖమ్మం అసెంబ్లీ సీటు అడుగుతున్నారు.
ఇప్పుడు కమ్మ సామాజిక వర్గం వారికి అక్కడి స్థానాలు ఇస్తే ఆ స్థానాలు ఆశించిన అభ్యర్థులు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా మారే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు అంటున్నారు. మరి కాంగ్రెస్ అధిష్టానం కమ్మ సామాజిక వర్గం అడిగిన సీట్లు ఇచ్చి వారి మద్దతు కూడగట్టుకుంటారో లేదో వేచి చూడాల్సిందే.