తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక సందర్భంగా కొత్త చర్చ!

-

ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో ఉపఎన్నిక వేళ ప్రధాన పార్టీల నేతలకు కొత్త కష్టం వచ్చిందట. నోటిఫికేషన్ రాకుండానే ఉప ఎన్నిక పై ప్రధాన పార్టీలు దృష్టి సారించడం ఆ పై నేతల రాకతో స్థానిక నాయకత్వానికి కొత్త సమస్యలొచ్చాయట.పార్టీలకు అతీతంగా అందరు నేతలు తమకు ఎదురవుతున్న సమస్యలను ఏకరువు పెడుతున్నారట ..

తిరుపతి లోక్‌సభకు త్వరలో ఉపఎన్నిక జరగనుంది. ఎన్నికలను పక్కన పెడితే తిరుపతి ఎప్పుడూ భక్తుల రాకపోకలతో రద్దీగా ఉంటుంది. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి నిత్యం వీఐపీలు వస్తూనే ఉంటారు. వీరిలో రాజకీయ నాయకులు.. వివిధ రంగాల ప్రముఖులు కామన్‌. మామూలుగానే వీరికి దర్శనాలు.. వసతి ఏర్పాటు చేయాలంటే స్థానికంగా ఉంటే ఆయా పార్టీల నేతలకు చుక్కలు కనిపిస్తుంటాయి. అలాంటిది ఇప్పుడు ఉప ఎన్నిక కూడా తోడు కావడంతో ఆ బాధలు పీక్స్‌కు చేరాయట.

ఉపఎన్నిక పేరు చెప్పి..హైదరాబాద్‌, అమరావతి, ఢిల్లీల నుంచి ఆయా పార్టీల నాయకులు తిరుపతిలో వాలిపోతున్నారు. తిరుపతికే పరిమితమైతే ఫర్వాలేదు. అక్కడ వసతి చూపించి మిగతా పార్టీ కార్యక్రమాల్లో బిజీ కావొచ్చు. కానీ.. వచ్చినవాళ్లు ఊరికే ఉంటారా.. పనిలో పనిగా తిరుమల శ్రీవారి దర్శనం కల్పించాలని కోరుతున్నారట. అదీ బ్రేక్‌ దర్శనం అడుగుతున్నారట. దీంతో మరింత ఇరకాటంలో పడుతున్నారట స్థానిక నాయకులు.

ఇలాంటి ఇబ్బందులు..తాకిడి లోకల్‌ బీజేపీ నాయకులకు ఎక్కువగా ఉందట. బీజేపీ జాతీయ పార్టీ. దాంతో ఢిల్లీ నుంచి..అమరావతి, హైదరాబాద్‌ల నుంచి అదే పనిగా నాయకులు డంప్‌ అవుతున్నారు. ఒక్కరుగా కాకుండా పదుల సంఖ్యలో వస్తున్నారు. వీరికి మంచి చెడ్డలు చూడటం ఒక ఎత్తు అయితే..దర్శనం కల్పించడం పెద్ద యజ్ఞంగా మారిందట. ఇప్పుడిప్పుడే టీడీపీ కార్యక్రమాలు కూడా పెరుగుతున్నాయి. ఆ పార్టీ లోకల్‌ లీడర్స్‌పైనా క్రమంగా ఒత్తిడి పెరుగుతోందట. ధర్మపరిరక్షణ పోరాట సమయంలోనే తెలుగు తమ్ముళ్లకు చుక్కలు కనిపించాయట. వసతితోపాటు.. దర్శనాలకోసం పరుగులు పెట్టారట టీడీపీ నేతలు.

జనసేన నాయకుల పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీ లేదట. వైసీపీ నుంచి ఇప్పుడిప్పుడే హడావిడి మొదలైంది. అధికార పార్టీ కాబట్టి వారికి వచ్చిన ఇబ్బంది పెద్దగా ఏమీ లేదట. కాకపోతే రాబోయే ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకుని ఆయా పార్టీలకు చెందిన నాయకులు తిరుపతిలోని గెస్ట్‌ హౌస్‌లను ముందుగానే బుక్‌ చేసి పెట్టుకున్నారట. బీజేపీ నాయకులైతే ఏకంగా అద్దెకు ఇళ్లే తీసేసుకున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే.. రాబోయే రోజుల్లో ఇంకెలా ఉంటుందో అని కలవర పడుతున్నారట నాయకులు.

 

Read more RELATED
Recommended to you

Latest news