రాజకీయాల్లో ఆరోపణలు, విమర్శలు చేయడం సహజమే. రాజకీయ ప్రత్యర్ధులు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటారు. అయితే ఆ ఆరోపణలని తిప్పికొట్టినవారిది పై చేయి అవుతుంది. అలాగే ఆరోపణలు గుడ్డిగా చేస్తే ప్రజలు నమ్మరు..దానికి ఆధారాలు ఉండాలి..కనీసం రియాలిటీకి దగ్గరగా ఉండాలి. అలా లేకపోతే ఇబ్బందులు తప్పవు. ఇప్పుడు ఏపీలో తనపై ఆరోపణలు చేస్తూ వస్తున్న ఎవరిని కూడా లోకేష్ వదలడం లేదు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేసిన వారిపై పరువునష్టం కేసు వేస్తున్నారు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన మొదట్లో సాక్షి దినపత్రిక..చినబాబు చిరుతిళ్ళకు రూ.25 లక్షలు ఖర్చు అని చెప్పి ఓ కథనం ఇచ్చింది. అంటే టిడిపి హయాంలో లోకేష్ మంత్రిగా ఉంటూ విశాఖ ఎయిర్ పోర్టులో చిరుతిళ్ళ కోసం చేసిన ఖర్చు అని ఆరోపణ చేసింది. ఈ ఆరోపణల్లో నిజం లేదని, సాక్షి తనపై బురదజల్లుతుందని చెప్పి ఆ సంస్థపై పరువు నష్టం దావా వేశారు. అలాగే స్కిల్ డెవలప్‌మెంట్ లో స్కామ్ అంటూ లోకేష్ పై ఆరోపణలు చేస్తే..అప్పుడు కూడా పరువు నష్టం దావా వేశారు.
ఇక ఇటీవల వైసీపీ నేత పోసాని కృష్ణమురళి..ఓ మీడియా చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కంతేరులో లోకేష్ 14 ఎకరాలు కొన్నారని ఆరోపించారు. అసలు అక్కడ తనకు సెంటు భూమి కూడా లేదని, లేనిపోని ఆరోపణలు చేసినందుకు క్షమాపణ చెప్పాలని పోసానికి లోకేష్ కోర్టు ద్వారా నోటీసు ఇచ్చారు. అయినా సరే పోసాని నుంచి స్పందన రాలేదు. దీంతో ఆయనపై పరువునష్టం దావా వేశారు.
ఇక ఓ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న సింగలూరి శాంతి ప్రసాద్ కూడా తనపై నిరాధారమైన ఆరోపణలు చేశారని తన న్యాయవాది ద్వారా నోటీసులు పంపించినా స్పందించకపోవటంతో శాంతి ప్రసాద్‌పై చర్యలు తీసుకోవాలంటూ లోకేష్ తన పిటీషన్ లో పేర్కొన్నారు. మొత్తానికి తనపై ఆరోపణలు చేసే వారిపై లోకేష్ పరువునష్టం కేసు వేస్తున్నారు.