తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడు కాంగ్రెస్ వ్వయహారం చర్చనీయాంశంగానే ఉంటోంది. గతంలో కూడా టీపీసీసీ కోసం సొంత పార్టీ నేతలపైనే విమర్శలు చేసుకున్నారు కాంగ్రెస్ నేతలు. ఇప్పుడు కూడా మళ్లీ అదే పంతాలో కొనసాగుతున్నారు. తమకే పదవి ఇవ్వాలంటూ తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. రేవంత్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్లు బలంగా వినిపిస్తున్నా ఇంకా ఎవరి పేర్లు ఫైనల్ కాలేదు.
దీంతో టీపీసీసీ పదవి కోసం ఎవరి పావులు వారు సీక్రెట్‌గానే కదుపుతున్నారు. ఇప్పటికే ఈ విషయంలో కోమటిరెడ్డి ఢిల్లీకి కూడా వెళ్లారు. కానీ ఆయన పేరు కూడా ఫైనల్ కాలేదు. ఈ క్రమంలో నిన్న ఉత్తమ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా కోమటిరెడ్డి వెళ్లి హైదరాబాద్‌లోని ఆయన ఇంట్లో కలిశారు.
ఈ సందర్భంగా దాదాపు మూడు గంటల వరకు వీరిద్దరూ ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, టీపీసీసీ చీఫ్ పదవి, ఢిల్లీ నాయకుల నిర్ణయంపైనే మాట్లాడుకున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ భేటీ తర్వాత ఎంపీ కోమటిరెడ్డి ఏకంగా ఢిల్లీకి బయలు దేరి వెళ్లారు. ఈ విషయం ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతోంది. ఇంకోవైపు కోమటిరెడ్డికే టీపీసీసీ వచ్చేలా ఉత్తమ్ మాట సాయం చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.