బాబుని ముంచుతున్న సొంత జిల్లా తమ్ముళ్ళు..?

-

చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో వైసీపీకి ఎక్కువ బలం ఉన్న సంగతి తెలిసిందే. గత రెండు ఎన్నికల్లోనూ జిల్లాలో వైసీపీ సత్తా చాటింది. గత ఎన్నికల్లో జిల్లాలో 14 సీట్లు ఉంటే 13 సీట్లు వైసీపీనే గెలుచుకుంది. అయితే ఇప్పుడు రాష్ట్రంలో కాస్త పరిస్తితులు మారుతున్నాయి. టీడీపీ నిదానంగా పుంజుకుంటుంది. కానీ చిత్తూరులో మాత్రం ఆ పరిస్తితి కనిపించడం లేదు. ఇక్కడ ఇప్పటికీ వైసీపీ బలంగా ఉండటానికి కారణం టీడీపీ నేతలు సరిగ్గా పనిచేయకపోవడమే.

 

వాస్తవానికి జిల్లాలో పలువురు వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉంది..ఆ వ్యతిరేకతని ఉపయోగించుకుని బలపడే స్థితిలో టీడీపీ లేదు. అంటే ఇదంతా కేవలం నాయకుల తప్పిదాల వల్లే అని చెప్పొచ్చు. టీడీపీ నాయకులు సరిగ్గా పనిచేయకపోవడం..పైగా అంతర్గత తగాదాలు, గ్రూపుల గొడవల కారణంగా చిత్తూరులో టీడీపీ ఇంకా వీక్ అవుతుంది. ఉదాహరణకు నగరి గురించి మాట్లాడుకుంటే..ఇక్కడ మంత్రి రోజాకు సానుకూల వాతావరణం లేదు. ఆమెపై వ్యతిరేకత ఉందని సర్వేలు చెబుతున్నాయి. పైగా ఇక్కడ రోజాకు సొంత పోరు ఎక్కువ ఉంది..వైసీపీ వాళ్లే రోజాని వ్యతిరేకిస్తున్నారు.

ఇలాంటి పరిస్తితులు ఉన్నప్పుడు నగరిలో టీడీపీ ఈజీగా గెలిచే ఛాన్స్ ఉంటుంది. కానీ ఆ పరిస్తితి కనిపించడం లేదు. టీడీపీ ఇంచార్జ్ గాలి భాను ప్రకాష్ దూకుడుగా పనిచేయకపోవడం, ఆయన ఫ్యామిలీలో అంతర్గత పోరు వల్ల నగరిలో టీడీపీ బలపడటం లేదు. మదనపల్లెలో అదే పరిస్తితి. ఇక పుంగనూరులో టీడీపీకి వింత పరిస్తితి..పుంగనూరు టీడీపీ నేతలు సోషల్ మీడియాలో హడావిడి తప్ప..నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి చేసేది ఏమి లేదు.

అటు తంబళ్ళపల్లెలో టీడీపీ ఇంచార్జ్ గా శంకర్ యాదవ్‌ వద్దని సొంత పార్టీ నేతలే గగ్గోలు పెడుతున్నారు. చిత్తూరు, పూతలపట్టులో నాయకులే లేరు. జీడీ నెల్లూరు, సత్యవేడుల్లో బలమైన కార్యకర్తలు ఉన్నారు గాని…సరైన నాయకులు లేరు. చంద్రగిరిలో పార్టీకి పట్టు లేదు. తిరుపతిలో పట్టు ఉన్నా సరే..బలమైన నాయకత్వం లేదు. శ్రీకాళహస్తిలో బొజ్జల సుధీర్ దూకుడుగా పనిచేయడం లేదు. గట్టిగా చూసుకుంటే పలమనేరు, పీలేరుల్లో మాత్రమే టీడీపీకి బలమైన నాయకత్వం, పార్టీకి బలం ఉంది. మొత్తానికి చిత్తూరులో తమ్ముళ్లే టీడీపీని ముంచేలా ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news