కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పిన పాలేరు ఎమ్మెల్యే.. త్వరలో టీఆర్‌ఎస్‌లోకి..!

లోక్‌సభ ఎన్నికలకు ముందే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తాకుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు. తాజాగా పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. ఆయన ఇవాళ టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిశారు.

త్వరలోనే టీఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నట్టు కందాల ప్రకటించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఇప్పటికే టీఆర్‌ఎస్ పార్టీలో చేరగా.. ఇప్పుడు పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి కూడా టీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వర రావుపై కందాల గెలుపొందారు. పాలేరు నియోజకవర్గం అభివృద్ధి కోసం టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. మరోవైపు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన సండ్ర వెంకటవీరయ్య కూడా టీఆర్‌ఎస్‌లో చేరేందుకు సన్నాహాలు చేస్తున్నారు.