తెలంగాణలో పవన్ దూకుడు..అసలు ప్లాన్ ఏంటి?

ఏపీలో దూకుడుగా రాజకీయాలు చేస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్….ఇప్పటివరకు తెలంగాణ రాజకీయాలపై పెద్దగా ఫోకస్ చేయలేదు. పార్టీ పెట్టి ఏడెనిమిదేళ్లు అవుతున్నా సరే పవన్ తెలంగాణపై పెద్దగా దృష్టి పెట్టలేదు. ఏదో బీజేపీతో పొత్తులో ఉన్నారు కాబట్టి ఆపార్టీకి మద్ధతుగా నిలబడుతూ వచ్చారు. కానీ ఇంతవరకు జనసేన తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయలేదు. అయితే ఇక నుంచి తెలంగాణ రాజకీయాల్లో కూడా దూకుడుగా ఉండాలని పవన్ డిసైడ్ అయినట్లు కనిపిస్తోంది.

pawan-kalyan
pawan-kalyan

అందుకే ఈ మధ్య ఎక్కువగా తెలంగాణలోని నేతలతో సమావేశమవుతున్నారు. పార్టీ బలోపేతానికి సలహాలు, సూచనలు ఇస్తున్నారు. ముఖ్యంగా యువత ఓట్లు టార్గెట్‌గా జనసేన పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే తెలంగాణ రాజకీయాల్లో పవన్ కల్యాణ్ ప్రభావం ఎంత ఉంటుందంటే….చెప్పలేని పరిస్తితి. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణలో పార్టీలు ఎక్కువైపోయాయి. ప్రధానంగా టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య ట్రైయాంగిల్ ఫైట్ నడుస్తోంది.

అటు తెలంగాణలో వైఎస్సార్ తనయురాలు షర్మిల కొత్తగా పార్టీ రాజకీయం మొదలుపెట్టారు. పాదయాత్ర కూడా చేస్తున్నారు. ఇటు కమ్యూనిస్టు పార్టీలు ఎలాగో ఉన్నాయి. ఇక కోదండరాం పార్టీ కూడా ఉంది. ఇక ప్రవీణ్ కుమార్ లాంటి వారు బీఎస్పీలో చేరి దూకుడుగా ఉన్నారు. మరోవైపు తీన్మార్ మల్లన్న లాంటి వారు ఇండిపెండెంట్‌గా రాజకీయం చేస్తున్నారు. ఇన్ని రాజకీయ శక్తుల మధ్య పవన్ కల్యాణ్..తెలంగాణలో రాజకీయ మనుగడ సాగించడం కష్టమే.

కాకపోతే బీజేపీతో పొత్తులో కొనసాగితే కాస్త బెనిఫిట్ ఉండొచ్చు. ఆంధ్రాలో ఆ రెండు పార్టీల మధ్య పొత్తు ఉన్నట్లు కనిపిస్తోంది. కానీ తెలంగాణలో మాత్రం జనసేన-బీజేపీల మధ్య అంత సఖ్యత ఉన్నట్లు కనిపించడం లేదు. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో పవన్…బీజేపీని కాదని టీఆర్ఎస్‌కు మద్ధతు ఇచ్చారు. అక్కడ నుంచి తెలంగాణలోని బీజేపీ నేతలతో పవన్ కల్యాణ్‌కు పెద్దగా సఖ్యత లేదు. బీజేపీ నేతలు సైతం పవన్‌ని పెద్దగా పట్టించుకోవడం లేదు. కానీ బీజేపీతో పొత్తు ఉంటే తెలంగాణలో పవన్ సత్తా చాటగలరు…లేదంటే అంతే సంగతులు.